
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ ఉన్న వారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేయడం మంచి విషయమని కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో జరిగిన మెగా రికార్డ్స్ ఇండిపెండెన్స్ డే అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలు అందించడం ప్రోత్సహకరంగా ఉంటుందన్నారు. మెగా రికార్డ్స్ క్రియేషన్స్ వ్యవస్థాపకులు పి. శ్రీనివాసరావును ఆయన అభినందించారు.
అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రేణుకా ప్రభాకర్ శిష్యబృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యప్రదర్శన, చిన్నారి రిత్విక్ శ్రీ డాన్స్ అలరించాయి. బండి రాములు, రుక్మిణి మాతాజీ బృందం యోగానాలు ఔరా అనిపించాయి. 70 ఏళ్ల వయసులో బండి రాములు వేసిన యోగానాలు సభికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 15 మందికి ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నాగసాయి వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. చిల్లా రాజశేఖర్‌రెడ్డి, జీసీ రెడ్డి, సనాతన బాలరాజు, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఏఎస్ రావు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: డాక్టర్ లాస్యసింధుకు జాతీయ హెల్త్‌కేర్ అవార్డు)
Comments
Please login to add a commentAdd a comment