బంజారాహిల్స్: బంజారాహిల్స్‌రోడ్ నెం.1లోని లామకాన్‌ను మూసివేయాలంటూ జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నోటీసులను అధికారులు వెనక్కి తీసుకున్నారు. లామకాన్‌ను మూసివేయాలంటూ జీహెచ్‌ఎంసీ సెంట్రల్ జోనల్‌కమిషనర్ వరుసగా మూడు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్‌చేసి గడిచిన పది రోజుల నుంచి హాట్‌టాపిక్‌గా మారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎంతో మంది ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్న ఈ కేంద్రాన్ని మూసివేయడం ఎంత వరకు సమంజసం అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
క్షణాల్లోనే అసద్ ట్వీట్‌ను చూసిన రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ వెంటనే ఈ నోటీసులను ఉప సంహరించుకునేలా జీహెచ్‌ఎంసీకి సూచిస్తామని పేర్కొన్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులను వెనక్కి తీసుకున్నారు. ప్రతిరోజూ వందలాది మంది యువతీ, యువకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు బృందాలుగా ఏర్పడి లామకాన్‌లో వివిధ అంశాలపై చర్చించుకుంటారు. ఇక్కడంతా ఉచిత సేవలు లభిస్తుంటాయి. అయితే లామకాన్ ముందు అక్రమపార్కింగ్‌లు, కొంత మంది బహిరంగ ధూమపానం చేయడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ రోడ్డులో నివసిస్తున్న ప్రజలు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదుచేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగానే జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతం నుంచి మహిళలు నడవలేని పరిస్థితులు ఉన్నాయని కూడా స్థానికులు ఆరోపించారు. తమ ఇళ్ల ముందు నో పార్కింగ్ బోర్డులను కూడా ఏర్పాటుచేసుకున్నా ఫలితం లేదని వారు వాపోయారు. అయితే జీహెచ్‌ఎంసీ నోటీసులకు లామకాన్ సమాధానం ఇస్తే పార్కింగ్ సమస్య తలెత్తకుండా చూస్తామని చెప్పారు. అయిదు మీటర్ల వరకు ధూమపానం నిషేధిస్తామని కూడా వెల్లడించారు.
లామకాన్ మూసివేత నోటీసులు వెనక్కి
Published Thu, Dec 31 2015 12:55 PM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM
Advertisement
Advertisement