వీడియో గేమ్స్ తప్ప అన్నింటినీ క్రీడల కోటాలో చేర్చారు
బీసీ, ఎస్సీ, ఎస్టీల అవకాశాలను కాలరాసేందుకే..
దొడ్డిదారిన ప్రవేశాలు పొందేందుకే ఈ కోటాలు తేల్చి చెప్పిన హైకోర్టు
హైదరాబాద్: క్రీడలు, ఎన్‌సీసీ తదితర కోటాల కింద రిజర్వేషన్లు పొందుతున్న తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ కోటాల కింద ఇచ్చే రిజర్వేషన్లకు రాజ్యాంగపరంగా ఎలాంటి చట్టబద్ధత లేదని తేల్చి చెప్పింది. విద్యా అవకాశాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకున్న రాజ్యాంగ హామీలను నీరుగార్చేందుకే.. క్రీడలు, ఎన్‌సీసీ వంటి కోటాల్లో రిజర్వేషన్లు కనిపెట్టారని పేర్కొంది. 2016 ఎంసెట్ ప్రవేశాల్లో క్రీడల కోటా కింద భర్తీ చేసే సీట్లకు సంబంధించి టెన్నికాయిట్, బాక్సింగ్, పవర్ లిఫ్టింగ్, నెట్‌బాల్, త్రోబాల్ తదితర ఆటలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 2016 ఎంసెట్ ప్రవేశాలకు టెన్నికాయిట్, బాక్సింగ్, పవర్ లిఫ్టింగ్, నెట్‌బాల్, త్రోబాల్ తదితర ఆటలను పరిగణనలోకి తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లాకు చెందినపాము తరుణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. వీడియో గేమ్స్ తప్ప మిగిలిన అన్ని క్రీడలను క్రీడల కోటా కిందకు తీసుకొచ్చారని, తద్వారా చదువులో రాణించలేని వారికి వైద్య విద్యలో దొడ్డిదారిన ప్రవేశాలు పొందేలా చేస్తున్నారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
‘క్రీడల కోటా కింద వైద్య విద్యలో ప్రవేశం పొందిన వ్యక్తి అంతో ఇంతో క్రీడల పట్ల తమకున్న ఇష్టాన్ని కూడా ఆ తర్వాత కోల్పోతున్నారు. అలాగే చదువులపై ఆసక్తి ఉన్న వ్యక్తులు.. ఈ కోటాల ద్వారా వచ్చిన తక్కువ ప్రతిభావంతుల వల్ల నష్టపోతున్నారు. వాస్తవానికి ఈ కోటాలకు రాజ్యాంగపరంగా ఎలాంటి చట్టబద్ధతా లేదు. ఈ కోటాల ద్వారా కల్పించే రిజర్వేషన్ల గురించి పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది..’ అని హైకోర్టు పేర్కొంది. ఈ కోటా వల్ల అటు క్రీడారంగంలోనూ గొప్ప క్రీడాకారులు కాలేరని, ఇటు వృత్తి నిపుణులూ కాలేరని తేల్చి చెప్పింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు వివరించింది.