
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినా భర్తలే పెత్తనం చెలాయిస్తున్నపుడు సాధికారత వచ్చినట్లు ఎలా అవుతుందని ఢిల్లీ హైకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి, ఓబీసీ ఉప కేటగిరీ కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ జి.రోహిణి ప్రశ్నించారు. మహిళా సాధికారత కోసం అనేక చట్టాలున్నా ఆచరణలో అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయన్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళల పురోగతికి సంప్రదాయాలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు అవరోధమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోకా రాఘవరావు లా ఫౌండేషన్ సహకారంతో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏసీ) రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సు ముగింపు సందర్భంగా శనివారం ‘మహిళా సాధికారతకు న్యాయపాలన బలోపేతం’ అంశంపై జస్టిస్ రోహిణి ప్రసంగించారు. ‘రాజ్యాంగంలోని 14, 15వ అధికరణల ప్రకారం మహిళలకు పురుషుల తో సమాన అవకాశాలున్నాయి. ఒకప్పుడు సంక్షమం వరకే పరిమితమైన అంశం ఇప్పుడు సాధికారత వరకూ వచ్చింది.
మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం చాలా కీలకం. ఏ స్థాయికి చేరినా వ్యక్తిగత ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడటం, ఇతరుల అనుమతులు తీసుకోవాల్సిన అగత్యం మహిళలకు ఏర్పడుతోంది. ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలు శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. ఈవ్‌టీజింగ్, గ్యాంగ్ రేప్, దారుణ వేధింపులు జరుగుతున్నాయి. సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి తెచ్చిన చట్టాలు నేటీకీ అమలు చేయాల్సిన స్థితులున్నాయి. బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు వంటి ఘటనలే అందుకు సాక్ష్యం’ అని అన్నారు.
‘రిజర్వేషన్ల బిల్లు ఏళ్లుగా పెండింగ్‌లోనే..’
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వాలు.. చట్టసభల్లోనూ అమలు చేసే బిల్లును ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంచారని మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పరాంకుశం వేణుగోపాల్ అన్నారు. దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న 450 న్యాయమూర్తుల పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో నలుగురు న్యాయమూర్తులు విభేదించి అదే అధికారిక భవనంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం సరికాదని సుప్రీంకోర్టు న్యాయవాది దీపక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. అక్రమ చొరబాటుదారులకు దేశ పౌరసత్వం జారీ కాకుండా చర్యలు తీసుకోవాలని గౌహతి హైకోర్టు న్యాయవాది అపరిచిత శర్మ కోరారు.