ఎస్సార్డీపీకి శ్రీకారం! | srdp started ! | Sakshi
Sakshi News home page

ఎస్సార్డీపీకి శ్రీకారం!

Published Mon, Aug 15 2016 11:43 PM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

మైండ్‌ స్పేస్‌ సమీపంలో ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టిన దృశ్యం... - Sakshi

మైండ్‌ స్పేస్‌ సమీపంలో ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపట్టిన దృశ్యం...

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు...సిటీని విశ్వనగరిగా నిలిపేందుకు బృహత్తర ప్రణాళికలతో రూపొందించిన స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ) పనులకు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత ఒకటో ప్యాకేజీలోని కేబీఆర్‌ పార్కు చుట్టూ జంక్షన్లలో బహుళ వరుసల ఫ్లై ఓవర్లతో నగరానికి కొత్తరూపునివ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ కేబీఆర్‌ పార్కు వద్ద పనులకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆంక్షలు అడ్డు కావడంతో ప్రస్తుతం ఇతర జంక్షన్లపై దృష్టి సారించింది. వాటిల్లో భూసేకరణ ఆటంకాలు లేని..తక్కువ ఆస్తులు మాత్రమే సేకరించాల్సిన మైండ్‌ స్పేస్, అయ్యప్ప సొసైటీల వద్ద పనులకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో మైండ్‌స్పేస్‌ వద్ద హైదరాబాద్‌ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్‌) పనులు కూడా జరగాల్సి ఉన్నందున సంబంధిత అధికారులు అక్కడ పనులు చేపట్టారు. మెట్రోరైలు కోసం అవసరమైన పిల్లర్లు నిర్మించాల్సి ఉండటంతో అక్కడ ఎక్స్‌కావేషన్‌ పనులు జరుపుతున్నారు. పిల్లర్ల నిర్మాణం జరిగాక బ్లాస్టింగ్‌లు వంటివి చేయకుండా ఉండేందుకు ఈ పనులు నిర్వహిస్తున్నారు. అక్కడ భారీ పరిమాణంలో దాదాపు 60 వేల క్యూబిక్‌ మీటర్ల మేర పెద్దపెద్ద బండరాళ్లుండటంతో రాక్‌ కట్టింగ్‌ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఈ పనుల్ని పూర్తిచేసి, భూమిని చదును చేసి హెచ్‌ఎంఆర్‌కు అప్పగించేందుకు వేగిరపడుతున్నారు.  హెచ్‌ఎంఆర్‌ పిల్లర్లకు తవ్వకాలు పూర్తయ్యాక మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి బయో డైవర్సిటీ పార్కు వైపు,  మైండ్‌ స్సేస్‌ జంక్షన్‌ నుంచి రహేజా ఐటీ పార్కు వైపు మూడు వరుసల్లో అండర్‌పాస్‌ నిర్మించనున్నారు. ఒక్కో వైపు దాదాపు 200 మీటర్ల మేర అండర్‌పాస్‌ నిర్మిస్తారు. అనంతరం దుర్గం చెరువు నుంచి డెలాయిట్‌ వరకు 2 ప్లస్‌ 2 లేన్లతో ఫ్లై ఓవర్‌ నిర్మించాలనేది లక్ష్యం. మరోవైపు అయ్యప్పసొసైటీ వద్ద సైతం పనులకు శ్రీకారం చుట్టారు. మిగతా జంక్షన్లలో భూసేకరణతోపాటు  వాటర్, డ్రైనేజీ, విద్యుత్‌ లైన్ల వంటి యుటిలిటీస్‌ తొలగింపు పనులు తదితరమైనవి జరగాల్సి ఉన్నందున తొలుత మైండ్‌స్పేస్, అయ్యప్పసొసైటీల వద్ద పనులు ప్రారంభించారు.
ఇదీ ప్యాకేజీ..
ఎస్సార్‌డీపీ నాలుగో ప్యాకేజీలో భాగంగా బయో డైవర్సిటీ పార్క్‌ జంక్షన్, అయ్యప్పసొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌లవద్ద పనులున్నాయి.ఈ ప్యాకేజీ అంచనా వ్యయం దాదాపు రూ. 200 కోట్లు కాగా, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్ద పనుల అంచనా రూ. 65 కోట్లు.
అండర్‌పాస్‌లు..
ఎస్సార్‌డీపీ పనుల్లో మైండ్‌స్పేస్, బయో డైవర్సిటీ, అయ్యప్ప సొసైటీ జంక్షనతోపాటు, బైరామల్‌గూడ జంక్షన్, కామినేని హాస్పిటల్‌ జంక్షన్, చింతల్‌కుంట చెక్‌పోస్టు జంక్షన్, ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ల వద్ద అండర్‌పాస్‌లు రానున్నాయి.
మిగతా ప్యాకేజీల్లో భూసేకరణ తర్వాత పనులు..
ఎస్సార్‌డీపీలో భాగంగా మొత్తం ఐదుప్యాకేజీల్లో 18 ప్రాంతాల్లో పనులకు టెండర్లు పిలిచారు. వీటిల్లో  ఒకటో ప్యాకేజీ అయిన  కేబీఆర్‌ పార్కుచుట్టూ ఆరుజంక్షన్లలో రెండు  వరుసల ఫ్లై ఓవర్లు నిర్మించేందుకు సిద్ధమై, భూసేకరణ ఇబ్బందులతో రెండు జంక్షన్లను తాత్కాలికంగా ఉపసంహరించుకొని, నాలుగు జంక్షన్ల వద్ద పనులు చేపట్టబోగా పర్యావరణ ప్రేమికులు ఎన్‌జీటీనాశ్రయించడంతో స్టే ఇచ్చింది. రెండో ప్యాకేజీలో ఎల్‌బీ నగర్, బైరామల్‌గూడ, కామినేని హాస్పిటల్‌ , చింతలకుంట చెక్‌పోస్టు జంక్షన్‌లున్నాయి. ప్యాకేజీ–3ను ఉపసంహరించుకున్నారు. ఐదో ప్యాకేజీలో ఒవైసీ హాస్పిటల్, బహదూర్‌పురా జంక్షన్లున్నాయి. భూసేకరణలు పూర్తయి, యుటిలిటీస్‌ తొలగింపు పనులు జరిగాక ఈ ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement