
సాక్షి, హైదరాబాద్: గోవా, విశాఖపట్నం నగరాల్లో 2014, 2015లో జరిగిన ఆలిండియా విప్‌ల సదస్సుల్లో చేసిన సిఫారసులను అమలు చేయడంలో తెలంగాణ శాసన సభ, శాసన మండలి ముందంజలో ఉన్నాయని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ప్రారంభమైన 18వ ఆలిండియా విప్‌ల సదస్సులో పాల్గొన్న పల్లా గత సదస్సుల్లో చేసిన తీర్మానాలు, తెలంగాణలో అమలవుతున్న తీరును వివరించారని టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
సిఫారసుల అమలులో తెలంగాణ ప్రభుత్వం ఫలవంతమైన కృషి చేస్తోందని, శాసన సభ, మండలి సమావేశాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. శీతాకాల సమావేశాలను 20 రోజుల పాటు నడపడం ద్వారా దేశానికే స్ఫూర్తిని ఇచ్చామన్నారు.
సదస్సు సందర్భంగా రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్, కేంద్ర మంత్రి విజయ్ గోయెల్‌ను కలసి పలు అంశాలపై చర్చించామని తెలిపారు. ఉదయ్‌పూర్ సదస్సులో మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఉభయ సభల విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, శాసన సభా కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారని వెల్లడించారు.