
1.42 లక్షల కోట్లతో ‘సాగు’దాం!
- 1.68 కోట్ల ఎకరాలకు ఐదేళ్లలో నీరిచ్చేలా రాష్ట్ర సాగునీటి ప్రణాళిక
- సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌షెడ్, సూక్ష్మసేద్యం పథకాల ద్వారా...
- ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన కింద అమలుకు నిర్ణయం
- 24న కేంద్రానికి నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా భూమికి నీరందించేలా రాష్ట్ర సాగునీటి ప్రణాళిక సిద్ధమైంది. మొత్తంగా 1.68 కోట్ల ఎకరాలకు నీరందించే కార్యాచరణ తయారైంది. ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన(పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ‘హర్ ఖేత్ కో పానీ’, ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) పథకాలను ఉపయోగించుకొని, వాటి కింద ఇచ్చే నిధులను రాబట్టుకునేందుకు వీలుగా జిల్లాల వారీ ప్రణాళికలను వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు కలసి సంయుక్తంగా సిద్ధం చేశాయి. ఈ నెల 24న రాష్ట్ర సాగునీటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని కృషి భవన్‌లో జరిగే సమావేశంలో పీఎంకేఎస్‌వై పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర వ్యవసాయ శాఖకు అందజేయనుంది.
ప్రతి ఎకరాకు నీరు
నీటి పారుదల శాఖ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మొత్తంగా 2.87 కోట్ల ఎకరాల భూ విస్తీర్ణం ఉండగా, అందులో సాగు యోగ్యభూమి 1.68 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో గోదావరి పరీవాహకం పరిధిలో 1.56 కోట్లు, కృష్ణా పరిధిలో 1.31 కోట్ల ఎకరాలు ఉంది. ప్రస్తుతం ఇందులో 60 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుండగా, మరో 52 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది. అయితే వివిధ పథకాల ద్వారా సాగు యోగ్యమయ్యే ప్రతి ఎకరాకు అంటే 1.68 కోట్ల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించిన కేంద్రం.. వివిధ పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాలను ఉపయోగించుకుంటూ జిల్లాల వారీగా ఐదేళ్ల ప్రణాళికను నీటి పారుదల శాఖ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం అమలుకు మొత్తంగా 1.42 లక్షల కోట్ల వ్యయం ఈ ఐదేళ్లలో చేయాల్సి ఉంటుందని లెక్కగట్టారు.
ఇందులో ఏఐబీపీ కింద రూ. 58,953.23 కోట్లు, హర్ కేత్‌కో పానీ పథకం కింద రూ. 30,884.13 కోట్లు, పర్ డ్రాప్-మోర్ క్రాప్ కింద రూ.16,498.98 కోట్లు, వాటర్‌షెడ్ పథకాల కింద రూ.7,400.11 కోట్లు, రాష్ట్ర ప్రణాళిక నుంచి రూ.20,749.38 కోట్ల వ్యయ అంచనా వేశారు. ఒక్కో పథకం కింద వృద్ధి చేసే ఆయకట్టు వివరాలను అందులో పొందుపరిచారు. ఇందులో ఏఐబీపీ పథకాల ఖర్చు నీటి పారుదల శాఖ ద్వారా జరగనుండగా, హర్ కేత్‌కో పానీ నిధులను చిన్న నీటి పారుదల శాఖ, పర్ డ్రాప్-మోర్‌క్రాప్ నిధులను ఉద్యాన శాఖ, వాటర్‌షెడ్ పథకాల నిధులను గ్రామీణాభివృద్ధి శాఖ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం నిధుల్లో రూ.67,136.75 కోట్లను పీఎంకేఎస్‌వై పథకంలో భాగంగా రాష్ట్రం తన వాటా కింద ఖర్చు చేయనుండగా మిగతా నిధులకు కేంద్రం సహకా రం అందించాల్సి ఉం టుంది. కేంద్రం ఏ మేరకు సహకారం అందిస్తున్న దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
కసరత్తు పూర్తి...
కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న పీఎంకేఎస్‌వై కింద ‘ప్రతి సాగుభూమికి నీరు’ పథకంలో భాగంగా రాష్ట్ర సమగ్ర సాగునీటి ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది. రానున్న ఐదేళ్లలో దీనికోసం రూ.50 వేల కోట్ల మేర కేటాయించేందుకు సిద్ధమని ప్రకటించింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే జిల్లాలో సాగు యోగ్యమయ్యే భూ విస్తీర్ణం, సాగు విస్తీర్ణం , ఇందులో బోర్లు, బావులు, భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల కింద సాగు జరుగుతున్న ఆయకట్టు, మిగతా ప్రాంతాన్ని సాగులోకి తెచ్చేందు కు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే అంశాలపై నీటిపారుదల శాఖ కసరత్తు పూర్తి చేసింది.