భార్య ఉండగానే మరో పెళ్లి
కటకటాల్లోకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
చాంద్రాయణగుట్ట: ప్రేమ పేరుతో వల వేసి... ఒకరికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్న ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం...కర్మన్‌ఘాట్ గాయత్రీనగర్‌కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. సైదాబాద్‌కు చెందిన పుష్పలత(25)ను ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్‌లోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు భార్యతో చక్కగా ఉన్న కిరణ్ ఆ తర్వాత బీటెక్‌లో తనతో పాటు చదువుకున్న గౌలిపురాకుచెందిన స్వాతి (24)ని ప్రేమలోకి దించాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి 2015 జూన్‌లో సీతాఫల్‌మండిలోని ఆర్యసమాజ్‌లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు.
మొదటి భార్యను సైదాబాద్‌లో, రెండో భార్యను గాయత్రీనగర్‌లో ఉంచాడు. ఇదిలా ఉండగా... మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకురావాలని కిరణ్‌కుమార్‌తో పాటు అతని తండ్రి శంకర్ నాయక్, తల్లి, అన్న, తమ్ముడు వేధించసాగారు. ఈ క్రమంలోనే కిరణ్‌కుమార్ రెండో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న మొదటి భార్య పుష్పలత ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్‌తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న కిరణ్‌కుమార్ తల్లి, అన్న, తమ్ముడి కోసం గాలింపు చేపట్టారు.