‘ఎస్‌ఆర్‌డీపీ’ని అడ్డుకోండి..
- దీని వల్ల సహజ వనరులకు తీరని నష్టం కలుగుతోంది
- హైకోర్టులో పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి పిల్
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నగరంలోని 20 కూడళ్లను కలుపుతూ మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను, ఫ్లై ఓవర్ల నిర్మాణం నిమిత్తం చెట్ల నరికివేత కోసం అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ జీవోలను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త కె.పురుషోత్తంరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ.4,051 కోట్ల వ్యయం తో మొదటి విడతలో మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణం నిమిత్తం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్‌డీపీ)కి అనుమతులిస్తూ గత ఏడాది మేలో జీవో 208ని జారీ చేసిందని, అలాగే చెట్ల నరికివేతకు అనుమతులిస్తూ ఈ ఏడాది మే 13న జీవో 19ని జారీ చేసిందని పురుషోత్తంరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ జీవోల వల్ల సహజ వనరులు ప్రమాదంలో పడ్డాయన్నారు. మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో భారీగా చెట్లను నరికేస్తున్నారని, ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే దుర్గం చెరువుకు కూడా ముప్పు వాటిల్లుతోందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ సమస్య తీరకపోగా మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోయి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,319 చెట్లు నరికివేతకు గురవుతున్నాయని, దీని వల్ల అనేక జీవరాశులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇదే హైకోర్టుకు గతంలో హామీ ఇచ్చిందని, దాని ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
పర్యావరణ అధ్యయన నోటిఫికేషన్ ప్రకారం భారీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరిగా చేపట్టాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయకుండానే మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ముందుకెళుతోందని పురుషోత్తంరెడ్డి ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోందని, ప్రాజెక్టు పనులపై ట్రిబ్యునల్ స్టే విధించిందని ఆయన తెలిపారు. అయితే జీవోల చట్టబద్దతను ట్రిబ్యునల్ ముందు సవాలు చేయడం కుదరదు కాబట్టి, హైకోర్టును ఆశ్రయించానని ఆయన వివరించారు. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును కోరారు.