బెదిరింపులు ఆపాలి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల నుంచి విద్యుత్ బిల్లులను బకాయిలతో సహా చెల్లించాలని పంచాయతీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం స్థానిక సంస్థలను బెదిరించడమేనని బీజేపీ పేర్కొంది. ఉత్తర్వులు ఇచ్చే ముందు 29 అంశాలపై స్థానిక సంస్థల అధికారాలను ఎందుకు బదిలీ చేయలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించింది. గతంలో మాదిరిగా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని, గత బకాయిలు రద్దుచేయాలని, గ్రామ పంచాయతీల నిధులపై ప్రభుత్వ జోక్యం చేసుకోవద్దని, విద్యుత్ వాడకం విషయంలో పంచాయతీలపై ఆంక్షలను ఎత్తేయాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు డా.ఎస్.మల్లారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
బీజేపీ కార్యాలయానికి ప్రవర్ణారెడ్డి
జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టులను అమ్ముకుంటున్నారని కొంత కాలంగా ఆరోపిస్తున్న ప్రవర్ణారెడ్డి మంగళవారం బీజేపీ కార్యాలయానికి వచ్చారు. అదే సమయంలో కార్యాలయానికి వచ్చిన బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్.. ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్టీ నేతలు మాట్లాడేందుకు పిలవడంతో కార్యాలయానికి వచ్చానని మీడియాకు ప్రవర్ణారెడ్డి తెలిపారు.