
అపార్ట్‌మెంట్‌కో ఎస్టీపీ!
మినీ మురుగు శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
నీటి కొరత తీర్చేందుకు జలమండలి కొత్త యోచన
20 ఫ్లాట్‌లు దాటిన అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలపైనే దృష్టి
రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ పద్ధతులపై ఆసక్తి
తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకునే వీలు..
గ్రేటర్‌లో అపార్ట్‌మెంట్‌కో మురుగు శుద్ధికేంద్రం (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్-ఎస్టీపీ) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.భూగర్భజల నిల్వలు అడుగంటిపోతుండడం, జలాశయాల నీటి నిల్వలు తగ్గుతుండడంతో మురుగునీటిని మంచినీటిగా మార్చి ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునే విధానాలపై దృష్టిసారించింది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరం పరిధిలో 20 ఫ్లాట్‌లు మించి ఉన్న అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌కమ్యునిటీల వద్ద స్థానికుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు బోర్డు వర్గాలు
‘సాక్షి’కి తెలిపాయి. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ‘ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ-ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) దరఖాస్తులు’ పిలవాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. - సాక్షి, సిటీబ్యూరో
మహానగరం పరిధిలో బహుళ అంతస్తుల భవంతుల సముదాయాలు సుమారు 20 వేల వరకు ఉన్నట్లు బోర్డు వర్గాలు గుర్తించాయి. భూగర్భజలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు ముందుకొస్తే ఎస్టీపీలను ఏర్పాటుచేసే అవకాశం ఉంటుందని జలమండలి వర్గాలు తెలిపాయి. కాగా పలు అభివద్ధి చెందిన దేశాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం(రెడ్యూస్), వినియోగించిన నీటిని శుద్ధిచేయడం(రీసైకిల్), తిరిగి వినియోగించడం(రీ యూజ్)పద్ధతులను అమలుచేస్తున్నారు. ఈవిధానాన్ని మూడు ‘ఆర్’ల(3ఆర్) విధానంగా పిలుస్తారు.
పది లక్షల ఖర్చుతో మినీ ఎస్టీపీ!
అపార్ట్‌మెంట్ల వద్ద రోజువారీగా ఐదు వేల కిలోలీటర్ల మురుగు నీటిని(5కేఎల్) శుద్ధిచేసేందుకు ఏర్పాటుచేసే చిన్నపాటి ఎస్టీపీ నిర్మాణానికి సుమారు రూ.10 లక్షలు ఖర్చవుతుంది. ఈ ఎస్టీపీ వద్ద ఏరియేషన్, రివర్స్ ఆస్మోసిస్ విధానాల ద్వారా మురుగునీటిలోని బీఓడీ, సీఓడీ, నురుగు, ఇతరత్రా కలుషిత అనుఘటకాలను తొలగించి మురుగునీటిలో సుమారు 60 శాతం నీరు తిరిగి వినియోగించుకునేలా శుద్ధిచేస్తారు. అంటే వందలీటర్ల మురుగు నీటిని శుద్ధిచేస్తే 60 లీటర్లను తిరిగి వినియోగించుకోవచ్చన్నమాట. కాగా ఈ నీరు తాగడానికి పనికిరాదు. కానీ గార్డెనింగ్, బాత్‌రూం ఫ్లష్, వాహనాలు శుభ్రపరచడం, ఫ్లోర్‌క్లీనింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. మన నగరంలో థర్మాక్స్ వంటి కంపెనీలు ఈటెక్నాలజీని అభివృద్ధిచేసి జలమండలికి ముందు మినీ ఎస్టీపీల ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.
వినియోగదారుల సహకారమే కీలకం..
ఎస్టీపీ నిర్మాణానికి జలమండలి సాంకేతిక సహకారమే అందిస్తుంది. నిర్మాణానికయ్యే వ్యయాన్ని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వినియోగదారులే భరించాలి. ఇప్పటికే నీటి బిల్లులు, ఇంటిపన్నులు, కరెంట్‌బిల్లుల మోతతో సతమతమౌతున్న వినియోగదారులు ఎస్టీపీల నిర్మాణానికి ఏమేర ముందుకొస్తారన్నది సందేహాస్పదంగా మారింది. వీటి నిర్మాణానికయ్యే వ్యయంలో జలమండలి సగం వ్యయాన్ని సమకూరిస్తే మిగతా మొత్తాన్ని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు భరించే ప్రతిపాదనను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు 20 ఫ్లాట్స్ దాటిన అపార్ట్‌మెంట్లకు మినీ ఎస్టీపీల నిర్మాణాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ యాక్ట్‌లో సవరణలు చేస్తేనే సత్ఫలితాలుంటాయని స్పష్టంచేస్తున్నారు.
మినీ మురుగు శుద్ధి కేంద్రాలతో ఉపయోగాలివీ..
భూగర్భజలాల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎస్టీపీల నిర్మాణంతో నీటిఎద్దడి గణనీయంగా తగ్గుతుంది. వాడుకునే నీటికి కొరత ఉండదు.మినీ ఎస్టీపీల్లో శుద్ధిచేయగా మిగిలిన నీటిని భూగర్భంలోకి మళ్లించి భూగర్భజల నిల్వలు పెంచవచ్చు. జలమండలి ట్యాంకర్ నీటికోసం ఎదరుచూసే అవస్థలు తప్పుతాయి. {పైవేటు ట్యాంకర్ల దోపిడీ నుంచి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ఐదువేల లీటర్ల నీటి ట్యాంకర్‌కే రూ.800 నుంచి రూ.1000 చెల్లించాల్సిన దుస్థితి తప్పుతుంది.
గార్డెనింగ్, గ్రీన్‌బిల్డింగ్‌లు, చిన్నపార్కుల నిర్వహణకు నీటికొరత ఉండదు. పచ్చదనానికి కొదవుండదు.పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలో మినీ ఎస్టీపీల నిర్మాణంతో నగరంలో మురుగునీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుంది. మూసీలోకి ప్రవహించే మురుగు ప్రవాహం తగ్గుతుంది. మూసీ ప్రక్షాళన మరింత సులువు అవుతుంది.లోతట్టు ప్రాంతాల్లో భూమిలోపల సుమారు 1500 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి డీప్ ట్యూబ్‌వెల్స్‌ను ఏర్పాటుచేసి ఎస్టీపీల్లో శుద్ధిచేసిన నీటిని వీటిల్లోకి మళ్లిస్తే భూగర్భ జలాల రీఛార్జీ సులువు అవుతుంది. మండువేసవిలో బోరుబావులు ఎండిపోయే దుస్థితి తప్పుతుంది.