సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అత్యధిక నిధులు వచ్చేలా కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదికలు అందజేయాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన సమాచారంతో నివేదికలను తయారు చేయాలని, నిధులు రాబట్టేందుకు అధికారులు సమర్పించే నివేదికలే కీలకమని అప్రమత్తం చేసింది. కేంద్ర ఆర్థిక సంఘం మొదటిసారిగా రాష్ట్రాల పురోగతిని దృష్టిలో పెట్టుకొని ప్రోత్సాహక గ్రాంట్లు ఇవ్వాలని యోచిస్తోంది.
ఈ నేపథ్యంలో అత్యధిక నిధులు రాబట్టే వ్యూహంతో నివేదికలు సిద్ధం చేయాలని చీఫ్ సెక్రెటరీ ఎస్‌పీ సింగ్ అన్ని శాఖల అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ అయ్యా రు. స్థానిక సంస్థలకు గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, జిల్లాల వారీ గా అభివృద్ధి, వివిధ అంశాల్లో సాధించిన ప్రగతి, స్ట్రాటజీ డెవలప్‌మెంట్ గోల్స్, ఆదాయ–వ్యయాలు, పన్నుల వసూలు వివరాలన్నీ ఆర్థిక సంఘానికి పంపించాలి. వీటన్నింటిపైనా సీఎస్ చర్చించారు.
ఈ నివేదికలకు ఆర్థిక శాఖలో ప్రత్యేక టీం, నోడల్ అధికారిని నియమించినట్లు సీఎస్ తెలిపారు. 2019 అక్టోబర్ 30న ఆర్థిక సంఘం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుందని, ఏప్రిల్ 2018 నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తుందన్నారు. అందుకే అన్ని శాఖ లు 2018 ఫిబ్రవరి 7 నాటికి తమ శాఖల్లో చేపడుతున్న పనులు వాటి ప్రగతి, లక్ష్యాలు తదితర వివరాలు సమర్పించాలన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఈ నెల 15 నాటికి సమర్పించాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment