వీధి కుక్కలు చంపేస్తున్నాయ్!
గ్రేటర్‌లో వీధి సింహాలు విజృంభిస్తున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు...సామాన్యులపై పంజా విసురుతున్నాయి. మూకుమ్మడి దాడులతో ప్రాణాలు తీస్తున్నాయి. వీధి కుక్కలను అదుపుచేయడంలో బల్దియా యంత్రాంగం దారుణంగా విఫలమవుతోంది. వీధి కుక్కల నియంత్రణ పేరిట ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా ఫలితం శూన్యం. దుర్ఘటన జరిగిన సమయంలో వీధి కుక్కల్ని కట్టడి చేస్తామని మేయర్‌సాబ్..కమిషనర్లు ఆర్భాటంగా ప్రకటిస్తున్నా..ఆచరణకు నోచుకోకపోవడం గమనార్హం. తాజాగా గ్రేటర్ శివారులోని మూడు చింతలపల్లి కాశవాడలో సోమవారం ఆరు వీధి కుక్కల దాడిలో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సిటీబ్యూరో: పదేళ్ల క్రితం నగరంలో వీధి కుక్కల సంఖ్య 1.5 లక్షలు ఉండగా, తాజాగా వీటి సంఖ్య 6.97 లక్షలకు చేరుకుంది. గతంలో సాధారణ రోజుల్లో రోజుకు 20 నుంచి 25 కుక్కకాటు కేసులు నమోదైతే..ప్రస్తుతం రోజుకు సగటున 45 నుంచి 50 కేసులు నమోదు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అంటే గంటకు సగటున 2 కేసులు నమోదవుతున్నాయన్నమాట. కుక్కల నియంత్రణ కోసం జీహెచ్‌ఎంసీ ఏటా దాదాపు రూ.పది కోట్లు ఖర్చు చేస్తున్నా...వీటి సంఖ్య తగ్గక పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుక్కలను నియంత్రించేందుకు ప్రభుత్వం యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) ద్వారా సంతాన నియంత్రణ చికిత్సలు(స్టెరిలైజేషన్) జరిపించేందుకు ఆటోనగర్, అంబర్‌పేట, చుడీబజార్, జీడిమెట్ల, పటాన్‌చెరులో కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 25 మందిని నియమించి ఒక్కో చికిత్సకు రూ.100 చొప్పున చెల్లిస్తుంది. ఇలా ఒక్కొక్కరికి నెలకు రూ.30 వేలపైనే చెల్లిస్తుంది. ఏటా 80 వేల కుక్కులకు కు.ని చికిత్సలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా...కుక్కల ఉత్పత్తి తగ్గక పోగా, వాటి సంఖ్య మరింత పెరగడం గమనార్హం.
ఇక్కడ పట్టి..అక్కడ వదిలి...
శివారు ప్రాంతాల్లోకి పొరుగు జిల్లాల నుంచి కుక్కలు వలస రావడంతో ప్రస్తుతం వీటి సంఖ్య 6.97 లక్షలకు చేరుకున్నట్లు ఓ అంచనా. పొరుగు ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న కుక్కల సంఖ్య తగ్గకపోవడం..బస్తీల్లో పట్టిన కుక్కలను శివారు ప్రాంతాల్లో వదులుతుండటం, మళ్లీ అవి బస్తీలకు వలస వస్తుండటం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. వీధి కుక్కలకు సరైన ఆహారం దొరక్క అవి చెత్తకుప్పల్లో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు తినడం...ఎండ తీవ్రతకు తీవ్ర ఇరిటేషన్‌కు లోనై..కన్పించిన వారినల్లా కాటేస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన ఉప్పల్, నాచారం, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్, హయత్‌నగర్, హస్తినాపురం, బడంగ్‌పేట్, మాదాపూర్, రాజేంద్రనగర్, కాటేదాన్, కూకట్‌పల్లి, మియాపూర్, శామీర్‌పేట తదితర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. బాధితుల్లో 50 శాతం మంది పదేళ్లలోపు చిన్నారులు ఉండగా, 10 శాతం వృద్ధులు, 20 శాతం యాచకులు, మరో 20 శాతం మంది ప్రయాణికులు ఉన్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యాంటిరేబిస్ ఇంజక్షన్ కోసం నారాయణగూడ ఐపీఎం, సహా నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి బాధితులు పొటెత్తుతుండటంతో ఉదయం వేళలో ఆయా వార్డులు బాధితులతో రద్దీగా మారుతున్నాయి.
వీధి కుక్కలు యమ డేంజర్..
కుక్క కాటు వల్ల వైరస్ కాలు నుంచి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్వరం, తల నొప్పి, వాంతులు తొలిదశలో, పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించలేక పోవడం, నోటిలోంచి నురుగు రావడం, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి రెండో దశలో కనిపిస్తాయి. ఇక మూడో దశలో పూర్తిగా కో మాలోకి వెళ్లి, రెండు మూడు రోజుల్లో మత్యువాతపడుతుంటారు. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఒక వేళ కుక్క కరిస్తే...వెంటనే ధారగా కారుతున్న నీటితో 10 నుంచి 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. రక్తం కారుతున్నా...గాయంపై కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటివి పోయకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో వ్యాక్సిన్ వేసుకోవాలి.
– డాక్టర్ రమేష్ దాంపురి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు