
ప్రదీప్‌ది ఆత్మహత్యే.. కానీ!
బుల్లితెర నటుడు ప్రదీప్‌ది ఆత్మహత్యేనని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రదీప్ భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశౄరు. ప్రదీప్ తల్లి, సోదరి ఇద్దరి వద్ద స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. మరోవైపు ప్రదీప్ అంత్యక్రియలు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మహా ప్రస్థానంలో గురువారం ఉదయం జరిగాయి. అంతకుముందు సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులతో పాటు విజయవాడ, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల బంధుమిత్రులు కూడా ప్రదీప్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
ప్రదీప్ భార్య వాట్సప్‌లో ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చుకునేంత వరకు వెళ్లాల్సింది కాదని, అయినా అది జీవితాన్ని బలితీసుకునే వరకు వెళ్తుందని అనుకోకపోవచ్చని టీవీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు అంటున్నారు. ఇద్దరూ ఒకే రంగంలో పనిచేస్తున్నప్పుడు ఒకరి కంటే మరొకరికి అవకాశాలు ఎక్కువ రావడం, సంపాదనలో కూడా తేడాలు ఉండటం లాంటి కారణాల వల్ల ఇద్దరికీ కూడా మానసికంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని, దాన్ని భాగస్వాములు గుర్తించి తగిన విధంగా మెసులుకోవాలని మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు.