నవ దంపతుల ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులే కారణం?
కుషాయిగూడ: నవదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా బొమ్మల రామారం మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన మంత్రి శ్రీనివాస్(25)కు నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందికి మౌనిక(19)తో గతేడాది డిసెంబర్ 12న పెళ్లైంది. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన శ్రీనివాస్ క్రేన్ డ్రైవర్‌గా పని చేస్తూ భార్యతో కలిసి సోనియాగాంధీనగర్‌లో ఉంటున్నాడు.
కాగా, పక్క ఫోర్షన్‌లోనే ఉంటున్న శ్రీనివాస్ తల్లి, సోదరుడు ఆదివారం బండ్లగూడలోని బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీనివాస్, మౌనిక ఇంటి పై కప్పుకు రాడ్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల ఇంటి నుంచి తిరిగి వచ్చిన తల్లి, సోదరుడు.. ఉరికి వేలాడుతున్న శ్రీనివాస్, మౌనికల మృతదేహాలను చూసి బోరుమన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. శ్రీనివాస్, మౌనిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.