సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ తదితరులు,అప్పారావు, మువ్వా కాసులు (ఫైల్)
నల్లగొండ, అడవిదేవులపల్లి (మిర్యాలగూడ) : అడవిదేవులపల్లి కృష్ణాతీరంలో యువజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. సోమవారం అటుగా వెళ్తున్న బాటసారులు అస్తిపంజరాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు ఆంధ్రా ప్రాంతంలోని గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామానికి చెందిన కోరె అప్పారావు (38), గురజాలకు చెందిన మువ్వా కాసులు(35)గా గుర్తించారు. ఘటనపై డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగవరం గ్రామానికి చెందిన అప్పారావు ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు . రోజు తన స్వగ్రామం నుంచి గురజాలకు రాకపోకలు సాగిస్తుండేవారు. ఈ క్రమంలో గురజాలకు చెందిన కాసులతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా ఏడాదిన్నర కాలంగా ఇరువురి మధ్య వివాహేతర సంబంధం సాగుతోంది.
పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు
వీరిద్దరు గతంలో రెండుమార్లు ఇళ్ల నుంచి పారిపోయారు. ఇరు కుటుంబాల సభ్యులు కేసులు పెట్టి వీరిని వెతికి తీసుకొచ్చారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వీరు వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మరో మారు వీరు ఇళ్ల నుంచి పారిపోగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు గురజాల పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది జనవరి 1న కేసులు నమోదయ్యాయి.
పురుగుల మందుతాగి ఆత్మహత్య
అడవిదేవులపల్లి కృష్ణా నదీతీరం సమీపంలోని టెయిల్‌పాండ్ వద్దకు సోమవారం బాటసారులు వెళ్తుండగా దుర్వాసన వస్తుండటంతో దగ్గరకు వెళ్లి చూశారు. రెండు అస్తిపంజరాలు కనిపించాయి. వారు వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్‌టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు డబ్బా, దుస్తులు, దుప్పటి కనిపించాయి, అస్తి పంజరాల వద్ద పడి ఉన్న అప్పారావు డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా విచారణ చేయగా వారి వివరాలు వెలుగులోకి వచ్చాయి. అప్పారావుకు భార్య, కొడుకు, కూతరు ఉన్నారు. కాసులకు భర్త, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. అస్తి పంజరాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment