ప్రేమ పెళ్లి.. విషాదాంతం | Young Couple Suicide In Gajuwaka | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేసుకున్న యువజంట కథ విషాదాంతం

Nov 23 2019 7:59 AM | Updated on Nov 23 2019 9:29 AM

Young Couple Suicide In Gajuwaka - Sakshi

ఆత్మహత్య చేసుకున్న యువ దంపతులు

రాత్రి ఇద్దరూ వివాహ కార్యక్రమానికి వెళ్లివచ్చారు.. తెల్లారేసరికి విగత జీవులై జంటగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న ఓ యువజంట విషాదాంతం గాజువాకలో కలకలం రేపింది. గాజువాక హైస్కూల్‌ రోడ్డులోని పెంటయ్యనగర్‌కు చెందిన నరేంద్రకుమార్, ఢిల్లీశ్వరి ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ జనవరిలో ఒక్కటయ్యారు. ప్రేమ పోరాటంలో గెలిచిన ఈ జంట.. జీవిత పోరాటంలో మాత్రం ఓడిపోయారు. ఆర్థిక ఇబ్బందులే వీరిని విధి చేతిలో ఓటమిపాల్జేశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఢిల్లీశ్వరీకి ఇటీవల గర్భస్రావం అయ్యిందని.. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం బాగోటం లేదని.. అదే వారి ఆత్మహత్యకు కారణం కావచ్చన్న మరో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ప్రేమను గెలిపించుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దలను ఎదిరించి.. దూరప్రాంతానికి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఈ రెండు కారణాలతోనే ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలోనూ కేసును పరిశీలిస్తున్నారు. 

సాక్షి, గాజువాక: పెద్దలను ఎదిరించి ప్రేమను గెలిపించుకున్న ఓ యువజంట జీవితంలో ఓడిపోయింది. కులాంతర వివాహం చేసుకొని తమ ధైర్యాన్ని చాటిన ఆ దంపతులు జీవించడంలో మాత్రం పిరికితనం ప్రదర్శించారు. ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చిన కొద్ది గంటలకే ఆ దంపతుల చావు కబురు తెలియడంతో వారి కుటుంబ సభ్యలు తల్లడిల్లిపోయారు. పోలీసులు, స్థానికు ల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాజువాక హైస్కూల్‌ రోడ్‌లోని పెంటయ్యనగర్‌కు చెందిన సేనాపతి నరేంద్రకుమార్‌(22), పుట్టేపు ఢిల్లీశ్వరి(19) ప్రేమించుకొని ఈ ఏడాది జనవరిలో కులాంతర వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి తొలుత పెద్దలు అంగీకరించకపోవడంతో ఒంగోలుకు పారిపోయి అక్కడ వివాహం చేసుకున్నారు. అక్కడే ఢిల్లీశ్వరికి గర్భస్రావమైందని తెలుసుకున్న పెద్దలు రెండు నెలల క్రితం వారిని ఇక్కడికి తీసుకొచ్చి తమ ఇళ్లకు సమీపంలోనే మరో ఇంట్లో కాపురం పెట్టించారు. నరేంద్రకుమార్‌ గాజువాక ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారని అందరూ అనుకొంటున్న సమయంలో వారు ఆత్మహత్య చేసుకోవడంతో గాజువాకలో విషాదం చోటుచేసుకుంది.

రోదిస్తున్న మృతుల బంధువులు
 
ఆత్మహత్యపై భిన్న కథనాలు 
యువ జంట ఆత్మహత్యపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్టు కొంతమంది.. ఆమెకు అనారోగ్యం కారణంగానే ఇద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు మరికొంతమంది బంధువులు చెబుతున్నారు. ఈ జంటకు చెందిన బంధువులు ఆర్థికంగా అంత పరిపుష్టి కలిగినవారు కాదు. ఢిల్లీశ్వరి తల్లితండ్రులు పండ్ల వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. నరేంద్ర కుమార్‌కు తండ్రి లేరు. తల్లి, ఒక సోదరి ఉన్నారు. ఆమె ఇటీవల వార్డు వలంటీర్‌గా ఎంపికైంది. దీంతో పెద్దలు వారిని ఆర్థికంగా ఆదుకొనే పరిస్థితి లేదు. ఆటోనగర్‌ కంపెనీలో వస్తున్న కొద్దిపాటి జీతం తమ అవసరాలకు సరిపోవడంలేదని, దీంతో భవిష్యత్‌పై బెంగతో ఈ పని చేసి ఉండవచ్చననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీశ్వరికి గర్భస్రావమైన తరువాత ఆమె ఆరోగ్యం బాగోవడం లేదని అంటున్నారు. ఈ కారణంతో ఇద్దరూ ప్రాణాలను తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండూ కాకుండా వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలపై కూడా పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం.

పెద్దల నుంచి ఇబ్బందులేమైనా? ఉన్నాయా? అన్న కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. ఒక్కటవ్వడం కోసం పెద్దలనే ఎదిరించిన ఆ జంటకు ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టమేమొచ్చిందంటూ స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అన్యోన్యంగా ఉన్న యువ దంపతులు గురువారం రాత్రి కూడా ఒక స్నేహితుడి వివాహానికి వెళ్లినట్టు బంధువులు చెబుతున్నారు. వివాహం చూసుకొని రాత్రి తిరిగి వచ్చిన తరువాత తెల్లవారేసరికి ఇంతటి అఘాయిత్యం చేసుకోవడం ఎవరికీ మింగుడుపడటం లేదు. ప్రతిరోజు ఉదయం 6 గంటలలోపే ఇంటి బయటకు వచ్చి సందడి చేసే ఆ దంపతులు విగతజీవులుగా పడి ఉండడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్యమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా వంటి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.ఈ విషయాన్ని గాజువాక సీఐ సూరినాయుడు వద్ద ప్రస్తావించగా, ఇప్పటి వరకు తమకు కూడా ఎటువంటి నిర్ధిష్టమైన సమాచారం లభించలేదన్నారు. ఈ విషయాలపై దర్యాప్తులో స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement