చెన్నై ,టీ.నగర్: తిరునెల్వేలి సమీపాన ప్రియుడు మృతిచెందిన ప్రాంతంలోనే ఓ యువతి ఐదేళ్ల బిడ్డను అనాథగా విడిచి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది. దీన్ని గమనించిన స్థానికులు నెల్‌లై పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో మృతిచెందిన యువతి మూలకరైపట్టికి చెందిన మురుగన్ కుమార్తె కర్పగం (25)గా తెలిసింది. ఈమెకు వివాహమై ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అభిప్రాయభేదాల కారణంగా ఆమె రెండేళ్ల క్రితం భర్తను విడిచి ఒంటరిగా జీవిస్తోంది. ఇలావుండగా కర్పగం పనిచేస్తున్న కంపెనీలో నరసింగనల్లూరు తిరువళ్లువర్‌నగర్‌కు చెందిన ఇంజినీరు మహారాజన్ (26)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇరువురూ కొన్ని రోజుల క్రితం తిరుపూర్‌లోని ఒక కంపెనీలో పనిచేస్తూ అక్కడే ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు.
కర్పగం తండ్రి మురుగన్ తన కుమార్తె కనిపించడం లేదని మూలకరైపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి తిరుపూర్‌లో మహరాజన్‌తో కుటుంబం నడుపుతున్న కర్పగంను విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత కూడా ఆమె మహారాజన్‌తో సంబంధాన్ని విడిచిపెట్టలేదు. తర్వాత పాళయంకోట్టైలో ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. ఆ సమయంలో తనను సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొమ్మని కర్పగం మహారాజన్‌ను కోరింది. దీనిపై మహారాజన్ తల్లిదండ్రులకు చెప్పగా వారు నిరాకరించారు. కర్పగం తనను మహారాజన్‌తో చేర్చాల్సిందిగా సుద్దమల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సంఘటన జరిగిన ప్రాంతం పాళయంకోట్టై పరిధిలో ఉందని చెప్పి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఇలావుండగా దీనిపై ఎటూ తేల్చుకోలేని మహారాజన్ తీవ్రమనస్తాపానికి గురయ్యాడు. ఇటీవల ఇంట్లో సెల్‌ఫోన్, ఏటీఎం కార్డు, పాన్‌కార్డులు ఉంచి మలయాళమేడు రైల్వే గేట్ సమీపాన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కర్పగం శనివారం మహారాజన్ మృతిచెందిన ప్రాంతంలోనే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్ల బిడ్డ అనాథగా మిగిలడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment