కన్నా.. నువ్వున్న చోటుకే వచ్చేస్తున్నాం! | - | Sakshi
Sakshi News home page

కన్నా.. నువ్వున్న చోటుకే వచ్చేస్తున్నాం!

Published Wed, Nov 6 2024 1:26 AM | Last Updated on Wed, Nov 6 2024 8:05 AM

-

 కోవైలో దంపతుల ఆత్మహత్య 

 ఏడేళ్ల కుమారుడి మృతి తట్టుకోలేకే.. 

సేలం: అనారోగ్యంతో ఏడేళ్ల కుమారుడి మృతి చెందడాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఉన్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోవైలో కలకలం రేపింది. వివరాలు.. విరుదునగర్‌ జిల్లా శివకాశి సమీపంలోని పూలావూరని గ్రామానికి చెందిన పళని స్వామి (39). ఈయన ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్‌ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన భార్య వత్సలా (35). ఈమె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. 

వీరికి ఏడేళ్ల వయస్సులో కుమారుడు ఉండేవాడు. అయితే గత ఏప్రిల్‌ నెల మెదడు జ్వరం కారణంగా మృతి చెందాడు. కుమారుడు చనిపోయినప్పటి నుంచి పళనిస్వామి, వత్సలాలు అమిత వేదనతో ఉంటూ వచ్చారు. వారిని బంధువులు సముదాయిస్తూ వచ్చారు. అయినప్పటికీ తీవ్ర ఆవేదనతో ఉన్న దంపతులను కోవైలో ఉన్న బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులు బంధువుల ఇంటిలో ఉన్న వారు ఇటీవల వేట్టపట్టి వీకేవీ శ్రీనగర్‌ ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తూ వచ్చారు. అయినా కొడుకు పోయాడనే ఆవేదనతో కనిపిస్తూ వచ్చారు.

ఆత్మహత్య..
ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గాంధీపురం కోట్టూర్‌ ప్రాంతంలో ఒక లాడ్జ్‌లో ఇద్దరు బస చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వరకూ ఇద్దరు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో సందేహించిన లాడ్జ్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాట్టూర్‌ పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా గదిలో దంపతులు ఇద్దరు నోటిలో నురగలు కక్కున్న స్థితిలో మృతదేహాలుగా పడి కనిపించారు. 

దీంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ గదిని తనిఖీ చేయగా, అక్కడ రెండు కూల్‌ డ్రింక్స్‌ బాటిళ్లు ఉన్నాయి. ఒక లేఖ చిక్కింది. ఆ లేఖలో.. తమ మృతికి ఎవరూ కారణం కాదని, తమ కుమారుడి వద్దకే వెళుతున్నామని రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement