హెల్మెట్ ధరించకుంటే ఇక నుంచి..
రాష్ట్రాలను ఆదేశించిన సుప్రీంకోర్టు నియమిత కమిటీ
కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం
నిబంధనల ఉల్లంఘనులకు కఠిన శిక్షలు వేయాలి
సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించని వారికి రెండు గంటలు కౌన్సెలింగ్, నిబంధనలు ఉల్లంఘించేవారి లెసైన్స్ రద్దు తదితర నిబంధనల్ని వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని రోడ్డు ప్రమాదాల నిరోధానికి సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గత వారం ఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఈ కమిటీ సమావేశమైంది. ప్రస్తుత నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు, ఆర్టీఏ అధికారుకు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు గత మంగళవారం లేఖలు రాసింది.
ఉల్లంఘనల విషయంలో మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్, జైలు శిక్ష వంటివి అమలు చేయాలంది. అధిక వేగంతో వాహనాలు నడుపుతూ, రెడ్ సిగ్నల్ జంప్ చేస్తూ, ఓవర్ లోడింగ్‌తో వెళ్తూ, మద్యం తాగి, మాదకద్రవ్యాలు సేవించి వాహనం నడుపుతూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ చిక్కిన వారికి జరిమానాతో పాటు ఆయా డ్రైవర్ల లెసైన్స్‌ను కనిష్టంగా 3 నెలల పాటు సస్పెండ్ చేయాలని సుప్రీం కోర్టు నియమిత కమిటీ స్పష్టం చేసింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ అత్యంత ప్రమాదం
మద్యం తాగి, మాదకద్రవ్యాలు సేవించి వాహనం నడిపే వారిని కచ్చితంగా కోర్టులో హాజరుపరిచి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్నవారూ హె ల్మెట్ వాడేలా చూడాలని, తేలికపాటి 4 చక్రాల చోదకులు సీటు బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి చేయాలని కమిటీ సూచించింది. బెల్టు ధరించని వారికి జరిమానా విధించే ముందు 2 గంటల పాటు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు 3 నెలలకు (డిసెంబర్ నాటికి) దీనికి సంబంధించి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.