ఆసక్తి రేకెత్తిస్తున్న సర్వే వివరాలు!
హైదరాబాద్: నగరంలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరిస్తున్న వివరాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని ఒక పక్కన చెబుతుంటే, సర్వేలో కుటుంబాలు, జనాభా, భవనాలు అన్నీ ఎక్కువగా ఉన్నట్లు తేలుతోంది. ఈ కారణంగా జిహెచ్ఎంసి పరిధిలో ఈరోజు సర్వే పూర్తి అయ్యే అవకాశం లేదు. మరో రెండు రోజులపాటు సర్వే చేయవలసి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల సర్వేను పొడిగించే అవకాశం ఉంది. ఈ విషయం కాసపేట్లో అధికారికంగా ప్రకటిస్తారు.
హైదరాబాద్‌లో జనాభాలెక్క, కుటుంబాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. అనుకున్న దానికన్నా 5 లక్షల మేర కుటుంబాల సంఖ్య పెరిగింది. భవనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోని కుటుంబాల సంఖ్యను లెక్కించడానికి సర్వే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అర్థరాత్రి వరకూ సర్వే కొనసాగిస్తారు. అప్పటికీ పూర్తి కాకపోతే రేపు కూడా కొనసాగించే అవకాశం ఉంది.
కొన్ని ప్రాంతాలలో సర్వే ఇంకా మొదలుకాలేదు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంది. కొన్నిచోట్ల చిరునామాలతో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంటి నంబర్లు సరిగాలేవు. ఎన్యూమరేటర్లు అవస్తలు పడుతున్నారు. ఎన్యూమరేటర్లు రాపోతే ప్రజలు అధికారులకు స్వయంగా ఫోన్లుచేస్తున్నారు.