చెట్టుకు ఉరేసుకొని బాలుడి మృతి
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
యాకుత్‌పురా: అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు మృతి చెందాడు. రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉండటం బట్టి.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం భవానీనగర్ ఎస్సై శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా రజానగర్ ప్రాంతానికి చెందిన మీర్జా మహ్మద్ బేగ్ కుమారుడు మీర్జా అహ్మద్ బేగ్ (14) ఈదిబజార్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన అహ్మద్ బేగ్ అర్ధరాత్రి అయినా తిరిగి రాలేదు. గురువారం ఉదయం మహమ్మద్‌నగర్ రైల్వే ట్రాక్ పక్కనున్న చెట్టుకు అహ్మద్‌బేగ్ ఉరేసుకొని మృతి చెంది ఉండగా స్థానికులు భవానీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని చెట్టు పై నుంచి కిందికి దించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఒంటిపై ప్యాంట్ తొలగించబడి చొక్కా మాత్రమే ఉంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి బోరుమన్నారు. పోలీసులు మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
కాగా మీర్జా మహ్మద్ బేగ్‌కు మృతుడు అహ్మద్ బేగ్‌తో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బాలుడు ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఎవరితో గొడవ పడలేదని... ప్రతి రోజు మాదిరిగానే బయటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం చెట్టుకు వేలాడుతూ ఉండటం, ఒంటిపై గాయాలు లేకపోవడం, ప్యాంట్ తొలగించబడటం వంటి కారణాల నేపథ్యంలో పోలీసులు అహ్మద్ బేగ్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక హత్యా, ఆత్మహత్య అనేది తెలుస్తుందని ఎస్సై శ్రీశైలం తెలిపారు.
ఆత్మ‘హత్య’?
Published Fri, Feb 27 2015 12:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement