తెలంగాణ స్త్రీల సాహిత్యంపై సదస్సు
హైదరాబాద్: తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా సాహిత్య అకాడమీ, కోఠి మహిళా విశ్వవిద్యాలయ కళాశాలలోని తెలుగుశాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఒక రోజు సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా సాహితీ ప్రియులందరిని ఆహ్వానిస్తున్నాయి. ఆగస్టు 30న(మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఈ సదస్సులో 'తెలంగాణ స్త్రీల సాహిత్యం సమాలోచన' అనే అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేయడంతోపాటు పత్ర సమర్పణ కూడా ఉంటుంది.
సాహిత్య అకాడెమి ప్రాంతీయ కార్యదర్శి ఎస్పీ మహాలింగేశ్వర్ ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పనుండగా.. తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి సంచాలకులు గోపీ ఈ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. ఇక స్వాగతోపన్యాసం ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, కీలకోపన్యాసం ఎస్ రఘు(తెలుగు శాఖాధ్యక్షులు కోఠి, మహిళా విశ్వవిద్యాలయం) చేయనున్నారు.
దీని అనంతరం రెండు దఫాలుగా ఈ సమావేశం జరుగనుంది. తొలి దఫా ఉదయం 11.30గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో దఫా సమావేశం మ.2గంటలకు ఉంటుంది. సూరెపల్లి సుజాత, అనిశెట్టి రజిత, కే లావణ్య, ఎన్ రజిని, ఎం గీతావాణి, గోగు శ్యామల వంటి రచయితలతోపాటు, పలువురు పరిశోధకులు పాల్గొంటున్నారు. సమాపన ప్రసంగం ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యక్షుడు వెలిదండ నిత్యానంద రావు చేయనున్నారు.