వ్యవస్థీకృతంగా బెట్టింగ్ దందా
గుట్టురట్టు చేసిన ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్
సాక్షి, సిటీబ్యూరో: క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్స్ నిర్వహించే బుకీలు నానాటికీ తెలివి మీరుతున్నారు. మూస ధోరణి నుంచి హైటెక్ పంథాలోకి మారిన వైనం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన ఎం.సంతోష్ మరో అడుగు ముందుకు వేశాడు. బెట్టింగ్స్ కోసం ఓ బ్రాంచ్ ‘ఆఫీస్’ సైతం ఓపెన్ చేశాడు. వ్యవస్థీకృతంగా వ్యవహారాలు సాగిస్తున్న ఈ ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం రట్టు చేశారు.
అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి కథనం ప్రకారం... కాచిగూడకు చెందిన వ్యాపారి సంతోష్ తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు బెట్టింగ్ దందా ప్రారంభించాడు. తమ ప్రాంతానికే చెందిన వినోద్, శ్యామ్‌సుందర్ కసత్‌లతో కలిసి ఇసామియాబజార్‌లో డెన్ ఏర్పాటు చేసుకుని పరిచయస్థులైన పంటర్లు (పందాలు కాసే వ్యక్తులు) నుంచి ఫోన్లపై బెట్టింగ్స్ స్వీకరిస్తున్నాడు. సుల్తాన్‌బజార్ ప్రాంతంలోనూ మరో ‘బ్రాంచ్ ఆఫీస్’ ఓపె న్ చేసిన ఇతగాడు దాని నిర్వహణ బాధ్యతల్ని నాంపల్లికి చెందిన ప్రైవే ట్ ఉద్యోగి అరుణ్ శర్మకు అప్పగించాడు. ఆశిష్ అగర్వాల్, రాజు లు రెండు ప్రాంతాల్లోని బెట్టింగ్ నిర్వాహకులకు సహకరిస్తున్నారు.
వీరికి సంతోష్ నెలకు రూ.ఆరు వేల నుంచి రూ.8 వేల జీతం ఇస్తున్నాడు. బెట్టింగ్ నిర్వహణలో రేష్యోగా పిలిచే అప్‌డేట్స్ అత్యంత కీలకం. ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు ఇందులో ఉంటాయి. దేశ వ్యాప్తంగా వీటి వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా తెలిపేందుకు ఢిల్లీకి చెందిన అగర్వాల్‌తో ఒప్పందం చేసుకుని నెలకు రూ.3 వేలు చొప్పున చెల్లిస్తున్నాడు. సిడ్నీలో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ నేపథ్యంలో సంతోష్ తన ‘రెండు కార్యాలయాల్లోనూ’ జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
దీనిపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, ఎ.రవికుమార్, ఎస్.శేఖర్‌రెడ్డి తమ బృందాలతో శనివారం రెండుచోట్లా దాడులు చేశారు. సంతోష్‌తో పాటు వినోద్, శ్యామ్, అరుణ్, ఆశిష్‌లను అరెస్టు చేసి టీవీ, సెల్‌టాప్ బాక్స్, సెల్‌ఫోన్లతో పాటు రూ.1.25 లక్షల నగదు, బెట్టింగ్ చీటీలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు లు కేసును స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగించారు.