హైదరాబాద్ : గోదావరి నదిపై తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, చిన్నారెడ్డి స్పందించారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్లో జీవన్రెడ్డి, చిన్నారెడ్డి మాట్లాడుతూ... ప్రాజెక్ట్ ఎత్తు152 మీటర్ల అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి లాభం కలిగి ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్ట్ ఎత్తు తగ్గడం వల్ల రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు మాత్రమే మేలు జరుగుతుందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం చక్రవర్తిలా వ్యవహరిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం సామంతరాజులా వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ను వారు డిమాండ్ చేశారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి రంగారెడ్డి జిల్లాను తొలగించి... మెదక్ వరకే పరిమితం చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ వల్ల కూడా రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి న్యాయం జరగిందన్నారు. ప్రాణిహిత - చేవెళ్ల పాత డిజైన్ ప్రకారం చేపడితేనే తెలంగాణకు మేలు జరుగుతుందని జీవన్రెడ్డి, చిన్నారెడ్డి చెప్పారు.