
ప్రజల అవసరాల్ని గుర్తించింది మా సర్కారే
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్ని అడుక్కునేలా చేశారు: తలసాని
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రభుత్వ రిమోట్ ప్రజల వద్ద ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రిమోట్ మాత్రం ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. రెండున్నరేళ్లలో చరిత్రాత్మక పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మాది. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్ని అడుక్కునేలా చేశారు.
కాంగ్రెస్ చేయనిది మేం రెండున్నరేళ్లలో చేసి చూపించాం’ అని పేర్కొన్నారు. అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేనందునే కాంగ్రెస్ వాళ్లను సన్నాసులు, దద్దమ్మలు అంటున్నారని పేర్కొన్నారు. నోరు ఉందని కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు.