విదేశాల్లో ఉద్యోగాల పేరుతో టోకరా
► బోగస్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ గుట్టురట్టు
► వర్క్ వీసా అంటూ విజిట్ వీసా అందజేత
► ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సాగుతున్న బోగస్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. గురువారం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు. వీరు కొన్ని సందర్భాల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సైతం తయారు చేసి విక్రయించినట్లు తెలిపారు. బాగ్ అంబర్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ అస్రఫ్ అంబర్‌పేట పరిధిలో అల్–సిద్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు.
హబ్సిగూడకు చెందిన శివకుమార్ అతని వద్ద పని చేస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే కన్సల్టెన్సీల నిర్వహణకు నిబంధనల ప్రకారం ఢిల్లీ కేంద్రంగా పని చేసే ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే అస్రఫ్ దుబాయ్‌లో వివిధ రకాలైన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం వచ్చే సూపర్‌వైజర్, ప్లంబర్, మెకానిక్, కుక్, హెల్మర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.65 వేల వరకు వసూలు చేస్తున్నారు. వారి నుంచి పాస్‌పోర్ట్స్ సైతం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేస్తున్నాడు. దీనిపై బాధితులు ప్రశ్నిస్తే పాస్‌పోర్టులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు.
కొన్ని సందర్భాల్లో అభ్యర్థులకు విజిటింగ్ వీసా ఇచ్చి దుబాయ్ పంపేవాడు. అదేమని ప్రశ్నిస్తే అక్కడ తమ ఏజెంట్ కలిసి జాబ్ వీసా ఇస్తాడని నమ్మించి మోసం చేస్తున్నారు. అభ్యర్థుల్లో డిగ్రీలు అవసరమైన వారికి అస్రఫ్, శివకుమార్ సాయంతో నకిలీవి తయారు చేసి ఇచ్చేవాడు. దీనిపై సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు తిమ్మప్ప, కాంతరెడ్డి గురువారం దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు.