dcp limba reddy
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో టోకరా
► బోగస్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ గుట్టురట్టు ► వర్క్ వీసా అంటూ విజిట్ వీసా అందజేత ► ఇద్దరిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సాగుతున్న బోగస్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. గురువారం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు. వీరు కొన్ని సందర్భాల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సైతం తయారు చేసి విక్రయించినట్లు తెలిపారు. బాగ్ అంబర్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ అస్రఫ్ అంబర్‌పేట పరిధిలో అల్–సిద్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. హబ్సిగూడకు చెందిన శివకుమార్ అతని వద్ద పని చేస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించే కన్సల్టెన్సీల నిర్వహణకు నిబంధనల ప్రకారం ఢిల్లీ కేంద్రంగా పని చేసే ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే అస్రఫ్ దుబాయ్‌లో వివిధ రకాలైన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం వచ్చే సూపర్వైజర్, ప్లంబర్, మెకానిక్, కుక్, హెల్మర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.65 వేల వరకు వసూలు చేస్తున్నారు. వారి నుంచి పాస్పోర్ట్స్ సైతం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేస్తున్నాడు. దీనిపై బాధితులు ప్రశ్నిస్తే పాస్‌పోర్టులు తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో అభ్యర్థులకు విజిటింగ్ వీసా ఇచ్చి దుబాయ్ పంపేవాడు. అదేమని ప్రశ్నిస్తే అక్కడ తమ ఏజెంట్ కలిసి జాబ్ వీసా ఇస్తాడని నమ్మించి మోసం చేస్తున్నారు. అభ్యర్థుల్లో డిగ్రీలు అవసరమైన వారికి అస్రఫ్, శివకుమార్ సాయంతో నకిలీవి తయారు చేసి ఇచ్చేవాడు. దీనిపై సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు తిమ్మప్ప, కాంతరెడ్డి గురువారం దాడులు నిర్వహించి నిందితులను అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. -
చైన్ స్నాచర్ అరెస్ట్ : భారీగా బంగారం స్వాధీనం
హైదరాబాద్ : సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్తుడు మొహమ్మద్ అమీర్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను గతంలో నగరంలో 34 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి మీడియాకు తెలిపారు. పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన అమీర్ ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 60 తులాల బంగారు నగలు, రెండు బైకులు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. -
అంతుచిక్కని దొంగల ముఠా ఆటకట్టు!
హైదరాబాద్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ అంతుచిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర దొంగల ముఠాను నార్త్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఠా వద్ద నుంచి 32 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారు, యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్లుగా నగరంలో పలుచోట్ల 15 చోరీలు చేసినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు. -
సంపన్నుల ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. అరెస్ట్!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): చోరీ చేయడం ఆ ఘరానా దొంగకు వెన్నతో పెట్టిన విద్య కాబోలు.. చిటికలో చోరీ చేసి అంతే వేగంగా కనుమరుగయ్యేవాడు. చిక్కడు దొరకడు అన్నట్టు పోలీసులకు దొరకకుండా చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. తనకు చోరీ చేయాలని అనిపిస్తే తొలుత తాళాలు వేసిన ఉన్న ఇళ్లపై కన్నుపడుతుంది. పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ నల్లకుంట పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకూ ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న అతగాడిని అరెస్ట్ చేసినట్టు ఆదివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన తిమ్మసముద్రం శివకుమార్ అలియాస్ శివ (27) చిన్నతనంలోనే నగరానికి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో పాఠశాల విద్య పూర్తి చేసుకుని 2005 వరకు దొరికిన పనిల్లా చేశాడు. ఆ తర్వాత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడంతో చిన్నచిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలయ్యాక బెంగళూరులో స్థిరపడ్డాడు. 15 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి నగరానికి వచ్చి సంపన్నుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహించేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీకి పాల్పడి వెంటనే బెంగళూరు వెళ్లిపోయేవాడు. అదే అలవాటుగా మళ్లీ వచ్చి చోరీకి పాల్పడుతుండగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి నుంచి 45 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి, రెండు ల్యాప్‌టాప్‌లు, ద్విచక్ర వాహనం, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల తయారీదారులు వలి పాష (45), నాగూర్ కర్నూల్‌కు చెందిన రామ్ ప్రసాద్ (25)లను అరెస్టు చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని కమిషనర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. -
కార్డన్ సెర్చ్..80 మంది అనుమానితుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ బేగంపేట పరిధిలోని రసూల్‌పురాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో రసూల్‌పురా ఏరియాలోని ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో యూపీ, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 80 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 30 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ గణేశ్ రెడ్డి, సీఐ గట్టు బస్వారెడ్డితో పాటు సుమారు 100కి పైగా పోలీసులు పాల్గొన్నారు.