రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): చోరీ చేయడం ఆ ఘరానా దొంగకు వెన్నతో పెట్టిన విద్య కాబోలు.. చిటికలో చోరీ చేసి అంతే వేగంగా కనుమరుగయ్యేవాడు. చిక్కడు దొరకడు అన్నట్టు పోలీసులకు దొరకకుండా చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. తనకు చోరీ చేయాలని అనిపిస్తే తొలుత తాళాలు వేసిన ఉన్న ఇళ్లపై కన్నుపడుతుంది. పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ నల్లకుంట పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకూ ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న అతగాడిని అరెస్ట్ చేసినట్టు ఆదివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు.
డీసీపీ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన తిమ్మసముద్రం శివకుమార్ అలియాస్ శివ (27) చిన్నతనంలోనే నగరానికి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత ఓ ఎన్‌జీవో సంస్థ సహకారంతో పాఠశాల విద్య పూర్తి చేసుకుని 2005 వరకు దొరికిన పనిల్లా చేశాడు. ఆ తర్వాత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడంతో చిన్నచిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలయ్యాక బెంగళూరులో స్థిరపడ్డాడు. 15 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి నగరానికి వచ్చి సంపన్నుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహించేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీకి పాల్పడి వెంటనే బెంగళూరు వెళ్లిపోయేవాడు. అదే అలవాటుగా మళ్లీ వచ్చి చోరీకి పాల్పడుతుండగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి నుంచి 45 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి, రెండు ల్యాప్‌టాప్‌లు, ద్విచక్ర వాహనం, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల తయారీదారులు వలి పాష (45), నాగూర్ కర్నూల్‌కు చెందిన రామ్ ప్రసాద్ (25)లను అరెస్టు చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని కమిషనర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
సంపన్నుల ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. అరెస్ట్!
Published Sun, Jun 12 2016 7:42 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement