nallakunta police
-
పోలీసుల బ్రెయిన్.. అదిరిన ప్లాన్.. కాపాడిన ట్రాఫిక్ క్రేన్..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్‌ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్‌ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్‌కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
శంకరమఠంలో దొంగలు పడ్డారు..!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రసిద్ధ క్షేత్రమైన శృంగేరీ పీఠం ప్రధాన కేంద్రమైన నల్లకుంటలోని శంకరమఠంలో దొంగలు పడ్డారు. 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇది ఇంటి దొంగల పనే కావొచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకునే బంగారు అభరణాలు భద్రపరిచే గదినుంచి కొన్ని వారాల క్రితమే మాయమైనట్టు మఠం అధికారులు వెల్లడించారు. ఇద్దరు క్లర్కు స్థాయి ఉద్యోగులు శ్రీనివాస్, సాయిని తొలగించామని తెలిపారు. అయితే, ఈ విషయం శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి దృష్టికి వెళ్లడంతో.. వారి ఆదేశాల మేరకు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిసింది. సాయి అనే ఉద్యోగిని నల్లకుంట పోలీసులు శనివారం విచారించనున్నట్టు సమాచారం. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హైదరాబాద్‌లో ఐసీస్ కలకలం.. వ్యక్తి అరెస్ట్
-
సంపన్నుల ఇళ్లే లక్ష్యంగా చోరీలు.. అరెస్ట్!
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): చోరీ చేయడం ఆ ఘరానా దొంగకు వెన్నతో పెట్టిన విద్య కాబోలు.. చిటికలో చోరీ చేసి అంతే వేగంగా కనుమరుగయ్యేవాడు. చిక్కడు దొరకడు అన్నట్టు పోలీసులకు దొరకకుండా చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. తనకు చోరీ చేయాలని అనిపిస్తే తొలుత తాళాలు వేసిన ఉన్న ఇళ్లపై కన్నుపడుతుంది. పథకం ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ నల్లకుంట పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరకూ ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఇన్నాళ్లు పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న అతగాడిని అరెస్ట్ చేసినట్టు ఆదివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ లింబారెడ్డి వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన తిమ్మసముద్రం శివకుమార్ అలియాస్ శివ (27) చిన్నతనంలోనే నగరానికి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో పాఠశాల విద్య పూర్తి చేసుకుని 2005 వరకు దొరికిన పనిల్లా చేశాడు. ఆ తర్వాత కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడంతో చిన్నచిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. జైలు నుంచి విడుదలయ్యాక బెంగళూరులో స్థిరపడ్డాడు. 15 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి నగరానికి వచ్చి సంపన్నుల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో రెక్కీ నిర్వహించేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చోరీకి పాల్పడి వెంటనే బెంగళూరు వెళ్లిపోయేవాడు. అదే అలవాటుగా మళ్లీ వచ్చి చోరీకి పాల్పడుతుండగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడితో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి నుంచి 45 తులాల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి, రెండు ల్యాప్‌టాప్‌లు, ద్విచక్ర వాహనం, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాల తయారీదారులు వలి పాష (45), నాగూర్ కర్నూల్‌కు చెందిన రామ్ ప్రసాద్ (25)లను అరెస్టు చేశారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని కమిషనర్‌కు సిఫార్సు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. -
నల్లకుంటలో దొంగ అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 4 తులాల బంగారం, మూడు తులాల వెండితోపాటు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా తమదైన శైలిలో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. -
స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి ...
స్నేహం పేరిట యువతిని ట్రాప్ చేసి...సెల్‌ఫోన్‌తో చిత్రీకరించిన అసభ్యకర వీడియో క్లిప్పింగ్స్‌ను చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఓ యువకుడిని నల్లకుంట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... రాంనగర్ గుండు సమీపంలో ఉంటున్న యువతి (19) వెంకటాపురంలోని కళాశాలలో చదువుకుంటోంది. గోల్నాకకు చెందిన అచ్యుతరామ్ 2011 నుంచి స్నేహం పేరుతో ఆమె వెంటపడుతున్నాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి మాట్లాడుకుంటున్నారు. దీని ఆసరా చేసుకొని ఆమె నివాసానికి వెళ్లిన ఇతను.. స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలు చిత్రీకరించాడు. తర్వాత ఆ క్లిప్పింగ్స్ చూపించి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. విషయం తెలిసిన అచ్యుతరామ్ తండ్రి యువతి కుటుంబ సభ్యులను పిలిపించి రాజీ కుదిర్చారు. అయినా ఆ యువకుడి ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా ఆమె ఎక్కడ కనిపించినా నీ అంతుచూస్తానని బెదిరిస్తున్నాడు. ఈనెల 3న కాలేజీలో పరీక్ష రాసి.. స్నేహితురాలి తండ్రి బైక్‌పై ఇంటికి వస్తుండగా.. అచ్యుతరామ్ ఆ యువతిపై చేయిచేసుకున్నాడు. విషయాన్ని ఆమె తన కుటుంబసభ్యులకు చెప్పగా...ఈనెల 5న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అచ్యుతరామ్ను సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుడు మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలిసింది.