హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్‌ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది.
ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది.
వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్‌ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్‌ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు.
చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్‌కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ‍్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment