టీడీపీ, బీజేపీ డిష్యుం డిష్యుం
హైదరాబాద్: అధినేతల ఆదేశాలను పక్కకుపెడుతూ తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు మరోసారి పోట్లాడుకున్నారు. ఈసారి ఉప్పల్ లోని మేకల భారతి గార్డెన్ ఇందుకు వేదికైంది. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఉప్పల్‌లో జరిగిన నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం రసాబాసగా మారింది. ఫ్లేక్సిలో టీడీపీ నేత వీరేందర్ గౌడ్ బోమ్మ లేకపోవడమే ఈ వివాదానికి కారణం.
సభా వేదికపై ఓ పక్క ఎమ్మెల్యే ప్రభాకర్, ఎంఎల్‌సీ రాంచందర్‌రావులు... మరో పక్క రంగారెడ్డి జిల్లా అర్బన్‌న్ అధ్యక్షులు మీసాల చంద్రయ్యలు ఉన్నారు. అదే సమయంలో వీరేందర్ గౌడ్ రాకతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. కొంత మంది టీడీపీ కార్యకర్తలు సభా స్థలిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసారు. వీరేందర్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో... ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో స్పందించడంతో సభా సమావేశంలో గందర గోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ లోపు సమావేశపై వేదికపై ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకుంటూ స్టేజికింద వరకు వచ్చారు. చోక్కాలు పట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ధూషణలకు దిగారు. దీంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎంతకు కార్యకర్తలు తగ్గక పోవడంతో వీరేందర్ గౌడ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు కూడా వెనుదిరిగారు. చివరికి సభ ప్రారంభం కాకుండానే ముగిసింది.
అనంతరం సభా ప్రాంగణంలో ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ... పది మంది కార్యకర్తలను వెనుకేసుకోచ్చి బోమ్మ కోసం రాద్దాంతం చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకం ఉన్న నాయకుడు ఇలా చేస్తాడా అంటూ పది మందితో రాద్దాంతం చేయాలకుంటే మేం అంతకు ఐదు రెట్లు ఎక్కువ చేసి చూపిస్తామన్నారు. మరోవైపు.. వీరేందర్‌గౌడ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర నాయకుని బోమ్మ లేదని కార్యకర్తలు ఆవేశానికి గురైనట్టు చెప్పారు. ప్రోటోకాల్ పని చేయలేదనే బాధే కానీ, మరో ఉద్దేశం లేదన్నారు. అన్ని సర్థుకు పోతాయని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కలిసి పని చేస్తామని చెప్పారు.