టీడీపీ ‘ఎంపీ’ రేసులో మీడియా అధిపతులు!
తెలుగుదేశం అధినేత బాబు వద్దకు పలుమార్గాల్లో రాయబారాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీకి విభిన్న కోణాల్లో సహకరిస్తున్నందున తమను తెలుగుదేశం తరఫున రాజ్యసభకు పంపాలని పలు టీవీ చానళ్లు, పత్రికల యజమానులు, ప్రతినిధులు, వారి బంధువులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరుతున్నారు. టీడీపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుకూలంగా వ్యవహరించిన అనేక సందర్భాలను గుర్తుచేస్తుండటంతో పాటు తమ అర్హతల గురించి పార్టీలోని ఇతర ముఖ్య నేతల వద్ద ఏకరువు పెడుతున్నారు. తమకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో తెలుగుదేశానికి ఇంకెంతగా ఉపయోగపడతామనేది వివరించడానికి కూడా వారు పోటీపడుతున్నారనేది సమాచారం.
పలువురు మీడియా అధిపతులు చంద్రబాబును కలిసి తమ మనసులోని మాటను బయట పెట్టగా ఆయన పరిశీలిస్తానని హామీనిచ్చినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రాజ్యసభ సీటు తమకు కేటాయించాలని చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి సుజనాచౌదరి మరోసారి తనను రాజ్యసభకు పంపాలని ఆశిస్తుండటంతో పాటు భాజపా కూడా రాజ్యసభ సీటును కోరుతున్నట్లు తెలుస్తోంది. తమనూ ఏపీ కోటాలో రాజ్యసభకు పంపే అవకాశాన్ని పరిశీలించాలని తెలంగాణకు చెందిన పలువురు నాయకులు చంద్రబాబును ఇదివరకే కలసి కోరారు.
కష్టపడుతున్నాంగా.. కరుణించండి...
పత్రిక-టీవీ చానల్ యజమాని ఒకరు టీడీపీ రాజ్యసభ రేసులో ఉన్నారని గట్టి ప్రచారం జరుగుతోంది. టీడీపీతో ఎంతో కాలంగా తనకు ఉన్న వ్యక్తిగత, సంస్థాగత సంబంధాల దృష్ట్యా రాజ్యసభ సీటు తనకు ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయం సమీపిస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు ప్రణాళికలను ఆయనే అమలు చేస్తున్నారని వినిపిస్తోంది. అందులో భాగంగా ఆయన తన పత్రిక, చానల్ ద్వారా ప్రతిపక్షపార్టీ ప్రజాప్రతి నిధుల గురించి ముందుగా పుకార్లు షికార్లు చేయించడం, ఆ తరువాత వారితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మంతనాలు, సమాలోచనలు జరపడం వంటివి చేస్తున్నారని టీడీపీ వర్గాలే అంటున్నాయి.
ఫలానా వారు పార్టీని వీడుతున్నారంటూ ఉన్నవీ, లేనివీ ప్రచారం చేయడం ఓ పథకం ప్రకారం జరుగుతోందనే చర్చ రాజకీయవర్గాల్లో కొనసాగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాలు, ప్రలోభాలు మొదలు ప్రతి అంశంలోనూ ఆ పత్రిక, చానల్ అధిపతి కీలకంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యసభకు వెళ్లాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే అలా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు బాహాటం గానే వ్యాఖ్యానిస్తున్నాయి. మరో చానల్ చైర్మన్ కూడా టీడీపీ రాజ్యసభ రేసులో ఉన్నారని సమాచారం. తమకు దేశ వ్యాప్తంగా ఉన్న చానల్ నెట్‌వర్క్ ద్వారా పార్టీ విస్తృతికి, ప్రభుత్వ విధానాల ప్రచారానికి సహ కరిస్తానని, గతంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన సహకారం పలు సందర్భాల్లో అందించానని టీడీపీ పెద్దల వద్ద ఆయన చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పత్రికలు, టీవీ చానళ్ల పెద్దలు ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పార్టీకి దక్కేది మూడు రాజ్యసభ సీట్లే కాబట్టి చంద్రబాబు మాత్రం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఎన్‌టీఆర్ భవన్ వర్గాల సమాచారం.
‘మీకోసం’ మేం.. మాకోసం మీరు..
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ఓ టీవీ చానల్ అధినేత టీడీపీ రాజ్యసభ అభ్యర్థిత్వానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. కొద్దిమంది టీడీపీ నేతల ద్వారా ఇప్పటికే తన మనసులోని మాటను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు, చంద్రబాబు మీకోసం, బస్సుయాత్ర, పాదయాత్ర తదితర సమయాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి వార్తలు కవర్ చేయించానని, పార్టీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా సానుకూల కథనాలు ప్రసారం చేశానని ఆయన బాబుకు పార్టీ నేతలతో చెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈనాడు చైర్మన్ సీహెచ్. రామోజీరావు దగ్గరి బంధువు ఒకరు రాజ్యసభ సీటుకోసం ప్రయత్నం చేస్తున్నారని, ఈయనకు చంద్రబాబుతో సుదీర్ఘకాలంగా సాన్నిహిత్యం ఉందని అంటున్నారు.