హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ నాలుగో విడత సమావేశాలకు సంబంధించిన అజెండా, పని దినాలు ఖరారు చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూధనాచారి అధ్యక్షతన శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ శాసనసభా పక్షం నేత డాక్టర్ లక్ష్మణ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, ఈ నెల 29వ తేదీ వరకు.. మొత్తం 16 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
31వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాల్సిందిగా బీజేపీ శాసనసభా పక్షం నేత లక్ష్మణ్ కోరగా.. సీఎం సుముఖత వ్యక్తం చేశారు. అయితే మరోమారు బీఏసీ నిర్వహించి సమావేశాలను రెండు రోజుల పాటు పొడిగించే అంశాన్ని ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 14వ తేదీన బడ్జెట్ 2016-17ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశ పెట్టనుండగా.. మార్చి 15న సెలవు ప్రకటించారు. హోలి, గుడ్‌ఫ్రై డేను దృష్టిలో పెట్టుకుని మార్చి 23, 24, 25 తేదీల్లోనూ సెలవు ప్రకటించారు. ఈ నాలుగు రోజులు మినహా శని, ఆదివారాలతో సంబంధం లేకుండా వరుసగా మార్చి 12 నుంచి 29వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.
మార్చి 29 వరకు బడ్జెట్ సమావేశాలు
Published Fri, Mar 11 2016 5:39 PM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM
Advertisement