249 రోజులు గడువు ఇవ్వండి...
హైదరాబాద్ : జీహెచ్ఎంపీ ఎన్నికల నిర్వహణపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహించేందుకు 249 రోజులు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం...న్యాయస్థానాన్ని కోరింది. వార్డుల పునర్విభజన జరుగుతోందని, అందుకు కొంతసమయం కావాలంటూ తెలంగాణ సర్కార్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే అంత గడువు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతకన్నా ముందే ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలతో రావాలని న్యాయస్థానం...ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
కాగా గడువు ముగిసినప్పటికీ జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.