జీహెచ్‌ఎంసీ ఎన్నికలెప్పుడు? | when do you conduct ghmc elections, high court questions government | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ ఎన్నికలెప్పుడు?

Published Tue, Mar 24 2015 12:32 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికలెప్పుడు? - Sakshi

జీహెచ్‌ఎంసీ ఎన్నికలెప్పుడు?

     రాష్ర్ట ప్రభుత్వానికి హైకోర్టు హుకుం
     వారంలోగా ఎన్నికల తేదీని ప్రకటించాలని ఆదేశం
     లేదంటే స్వయంగా ఆదేశాలిస్తామన్న ధర్మాసనం
     వార్డుల పునర్విభజనలో జాప్యంపై సర్కారుకు మొట్టికాయ
     విచారణ ఈ నెల 30కి వాయిదా
 సాక్షి, హైదరాబాద్: వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గత ఆగస్టులో ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు ఏం చేశారని రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో నిర్దిష్ట తేదీని వారం రోజుల్లో తెలియజేయాలని సోమవారం ఆదేశిం చింది. లేదంటే ఎన్నికల నిర్వహణకు తామే తేదీని నిర్ణయించి, ఆ మేరకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
 గడువు ముగిసినప్పటికీ జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. స్పెషల్ ఆఫీసర్ల నియామకపు జీవో 186ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు విని పిస్తూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు 249 రోజుల గడువు కావాలంటూ జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారని తెలిపారు. వాస్తవానికి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కౌంటర్ ద్వారా తెలియజేయాలని, అయితే తెలివిగా ఆ పని చేయకుండా తప్పించుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జీహెచ్‌ఎంసీ పాలక మండలి కాల పరిమితి గడువు గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిందని, రాజ్యాంగం ప్రకారం కాల పరిమితి ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కలుగజేసుకుంటూ.. రాష్ట్ర విభజన తర్వాత అతి తక్కువ మంది అధికారులతో పని చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం వార్డుల పునర్విభజనను చేపట్టామని వివరించారు. ఈ పనుల వివరాలను కౌంటర్ ద్వారా కోర్టుకు సోమేశ్‌కుమార్ తెలిపారని చెప్పారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘249 రోజుల్లో ఇప్పటికే 90 రోజులు గడిచిపోయాయి. మీరు ఏం చేయాల్సి ఉందో అది మాత్రమే చెప్పారు. అయినా స్పెషల్ ఆఫీసర్ కౌంటర్ దాఖలు చేయడమేంటి? ప్రభుత్వం దాఖలు చేయాలి కదా..’ అని వ్యాఖ్యానించింది. తమకు ఏ వివరాలు అక్కర్లేదని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో వారం రోజుల్లో(వచ్చే సోమవారంలోగా) చెప్పాలని, లేనిపక్షంలో తామే తేదీని నిర్ణయించి ఉత్తర్వులిస్తామని పేర్కొంది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement