బల్దియా భేరి..?
జీహెచ్‌ఎంసీ ఎన్నికలెప్పుడంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
వారం రోజుల్లో షెడ్యూల్‌తో సహా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం
ఈసీతో చర్చించి స్పష్టత ఇవ్వాలని ఏజీకి హుకుం.. విచారణ 9కి వాయిదా
కోర్టు ఆదేశాల నేపథ్యంలో 6 నెలల్లో ఎన్నికలకు అవకాశం
డీలిమిటేషన్, ‘బీసీ గణన’ పరిశీలన తర్వాతే తేదీల నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు గంట మోగనుంది! వాటిని ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చి చెప్పాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పాలకమండలి కాల పరిమితి ముగిసినా ఎన్నికల నిర్వహణకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. దీనిపై ఎన్నికల సంఘంతో చర్చించి వారం రోజుల్లో షెడ్యూల్ తేదీలతోపాటు అఫిడవిట్‌ను సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. తాజా పరిణామంతో మరో ఆరు నెలల్లోనే గ్రేటర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. వీలైనంత త్వరగా వార్డుల విభజన పూర్తిచేసి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా హైకోర్టు గత ఆగస్టులోనే తీర్పునిచ్చినప్పటికీ, ఇంతవరకు ఆ ప్రక్రియనే ప్రారంభంకాలేదు. వాస్తవానికి పాలకమండలి గడువులోగా నిర్ణీత వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. పాలకమండలి గడువు ముగిసినప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. నిబంధనల ప్రకారం దీనికి ఆరు నెలల వరకు వెసులుబాటు ఉంటుంది. గత డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌నే ప్రభుత్వం స్పెషలాఫీసర్‌గా నియమించింది. ప్రస్తుతం మరో నాలుగునెలల వరకు ఈ ‘ప్రత్యేక’ పాలనకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించి తాజా ఆదేశాలిచ్చింది. షెడ్యూల్‌తో పాటు కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్నందున ప్రభుత్వానికి ఈ ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. కాగా, డివిజన్ల పునర్విభజన(డీలిమిటేషన్) పూర్తి చేసి ఎన్నికలు నిర్వహిస్తారా లేక అందుకు సమయం అవసరమైనందున హైకోర్టు నుంచి మినహాయింపు తీసుకుని ఎన్నికలు పూర్తి చేస్తారా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్‌లో పట్టు సాధించేందుకు, టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసే దిశగా చర్యలపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అన్ని డివిజన్లలోనూ టీఆర్‌ఎస్ శాఖలను ఏర్పాటు చేసి నగరంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశాకే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకనుగుణంగానే ఎన్నికలను జాప్యం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన హైకోర్టు ఆదేశాలతో వెంటనే ఎన్నికలకు వెళ్లడం అనివార్యంగా మారింది. దీంతో డివిజన్ల పెంపు, రిజర్వేషన్ల అమలు కోసం బీసీ గణన పూర్తి చేయడం తదితర అంశాలపై కూలంకషంగా పరిశీలన జరిపిన తర్వాత ఎన్నికల నిర్వహణ ఎప్పుడన్నది తేల్చే అవకాశముంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే దాదాపు ఆర్నెళ్ల సమయం పట్టవచ్చునని అంచనా. ఒకవేళ జీహెచ్‌ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా విభజించాలనుకుంటే ఎన్నికలకు ముందుగానే ఆ ప్రక్రియను పూర్తిచేసి.. అన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకిచ్చే వివరణ ద్వారా పూర్తి స్పష్టతరానుంది.
గడువు ముగిసినా చర్యలేవి?: హైకోర్టు
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో ఎన్నికల కమిషన్‌తో చర్చించి వారం రోజుల్లో షెడ్యూల్‌తో సహా అఫిడవిట్‌ను సమర్పించాలని ఏజీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. పాలకమండలి కాల పరిమితి ముగిసినా ఎన్నికల నిర్వహణకు ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికల నిర్వహించడమనేది రాజ్యాంగపరమైన విధి అని, ఈ విధిని నిర్వర్తించడంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని నిలదీసింది. గడువు ముగిసినా జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడం, స్పెషల్ ఆఫీసర్ల నియామకాన్ని సవాల్ చేస్తూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఆఫీసర్ల నియామకపు జీవో 186ని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కూడా ఆయన కోర్టును కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ప్రత్యేకాధికారులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని, సమయమిస్తే ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. అయితే అందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.