గ్రూప్-2 వాయిదా
- 3న జరగాల్సిన కానిస్టేబుల్ పరీక్ష కూడా.. అధికారులను ఆదేశించిన సీఎం
- మరిన్ని పోస్టులతో రెండు నెలల తర్వాత గ్రూప్-2 పరీక్ష
- 300 వరకూ పోస్టులు అదనంగా వచ్చే అవకాశం
- కానిస్టేబుల్ పరీక్ష కొత్త తేదీపై త్వరలో ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో జరగాల్సిన గ్రూప్-2, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పరీక్షలు వాయిదాపడ్డాయి. గ్రూప్-2కు సంబంధించి మరిన్ని పోస్టులను పెంచేందుకు ఆ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణిని ఆదేశించారు. కొత్త పోస్టులు వచ్చే వరకు ఆగాలని, అప్పుడు ఒకేసారి పరీక్ష నిర్వహించాలని సూచించారు. ఇక రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష కారణంగా కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటించనున్నారు.
అంచనాలకు మించి పోటీ
రాష్ట్రంలో 439 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గత డిసెంబర్ 30న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా... ఏకంగా 5,64,431 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సగటున 1,285 మంది పోటీపడుతున్నారు. వచ్చే నెల 24, 25 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. అయితే పోటీ తీవ్రంగా ఉండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది. పోస్టుల సంఖ్య పెంచాలని, అప్పటివరకు పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనలు కూడా చేశారు.
దీంతోపాటు గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ అంశంపై శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఆర్.కృష్ణయ్య తదితరులు సీఎం కేసీఆర్‌ను కలసి చర్చించారు. అనంతరం గ్రూప్-2 పరీక్ష వాయిదాకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెబుతున్నారు.
కానిస్టేబుల్ పరీక్షకు ‘ఆర్‌ఆర్‌బీ’ అడ్డంకి
ఏప్రిల్ 3న జరగాల్సిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ పరీక్షను కూడా వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అదేరోజున రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్ష ఉన్నందున నిరుద్యోగులు నష్టపోయే అవకాశముందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 5.36 లక్షల మంది హాజరుకానున్నారు. 1,100 పరీక్షా కేంద్రాలను సైతం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. కానీ సీఎం ఆదేశాల మేరకు పరీక్షను వాయిదా వేసింది.
తిరిగి పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఇక ఎస్సై పోస్టులకు రాతపరీక్షను కేవలం ఇంగ్లిషులోనే కాకుండా తెలుగులో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎస్సై తుది పరీక్షలో ఇంగ్లిష్‌కు ఇచ్చే వెయిటేజీని తొలగించి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు నష్టం జరగకుండా చూడాలని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇంకా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు.
గ్రూప్-2లో మరో 300 పోస్టులు!
గ్రూప్-2 వాయిదా, పోస్టుల పెంపు నిర్ణయంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ప్రస్తుతమున్న 439 పోస్టులకు తోడుగా మరో 300 పోస్టులు పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జూన్‌లో వివిధ శాఖలు పంపిన ఖాళీల వివరాల ప్రకారం రెండు వందలకుపైగా పోస్టులు ఇప్పటికే ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
ఈలోగా రిటైరైన ఉద్యోగులతో పాటు కొత్తగా వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులను కలిపితే ఖాళీల సంఖ్య మరింత పెరగడం ఖాయం. దీంతో దాదాపు 300 పోస్టులు అదనంగా వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తక్కువ పోస్టులున్నాయనే కారణంగా చాలా మంది దరఖాస్తు చేయలేదని, పోస్టుల సంఖ్యను పెంచితే దరఖాస్తులకు మళ్లీ అవకాశమివ్వాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.