ఏపీ పోలీసులకు టీఎస్‌లో దందాలు! | Telangana in dandha's to ap police! | Sakshi
Sakshi News home page

ఏపీ పోలీసులకు టీఎస్‌లో దందాలు!

Published Fri, Aug 12 2016 4:39 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

Telangana in dandha's to ap police!

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులతోనూ గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయా..? తెలంగాణలో దందాలు, సెటిల్‌మెంట్ల కోసం వారు నయీమ్‌ను వాడుకున్నారా..? ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నాయి పోలీసు వర్గాలు. నయీమ్ ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న ‘కోడ్స్’ను డీ-కోడ్ చేస్తున్న అధికారులు ప్రాథమికంగా ఏపీలో పని చేస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వీరికి నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

‘ఉమ్మడి’లోనే పరిచయం..
ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా పనిచేసిన నయీమ్.. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం అందిస్తున్నప్పుడే ఓ అధికారితో పరిచయం ఏర్పడింది. అప్పట్లో ఆయన మావోయిస్టు వ్యతిరేక విభాగంలో విధులు నిర్వర్తించారు. విభజన తర్వాత ఏపీ పోలీసులో పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో పాటు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్స్‌లో అనుభవజ్ఞులు చాలా మంది తెలంగాణలో ఉండిపోయారు. దీంతో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉందని భావించిన ఆయన వారి కదలికలపై సమాచారం కోసం రహస్యంగా నయీమ్‌ను సంప్రదించారు. తమకు ఉపయుక్తమైన వివరాలు వెల్లడిస్తుంటే అవసరమైన ‘సహాయ సహకారాలు’ అందిస్తామంటూ వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
 
‘ఓటుకు కోట్లు’తో మారిన సీన్..
ఆ ఇద్దరు అధికారులూ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేశారు. వీరిలో ఒకరికి నగరంతో పాటు శివార్లలోనూ కొన్ని రియల్ ఎస్టేట్ దందాలు, లావాదేవీలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినా కొంత కాలం ఆయన హవా తెలంగాణలో నడిచింది. అయితే గత ఏడాది వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసుతో రెండు రాష్ట్రాల మధ్యా అగాధం ఏర్పడింది. ఈ ప్రభావం పోలీసు విభాగాలపైనా పడటంతో సదరు ఉన్నతాధికారి దందాలు సాగడం కష్టంగా మారిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే నయీమ్‌ను మరో కోణంలోనూ వాడుకోవాలని నిర్ణయించుకున్న ఆయన.. నయీమ్‌ను తనకు పరిచయం చేసిన అధికారి ద్వారా రాయబారం పంపారు.
 
నయీమ్‌కు గిఫ్ట్‌గా శాటిలైట్ ఫోన్..?
నయీమ్ ఆ ఇద్దరితో విజయవాడ-గుంటూరు మధ్య ఉన్న ఓ రిసార్ట్‌లో గత ఏడాది ద్వితీయార్థంలో సమావేశమైనట్లు తెలిసింది. వారిలోని ఉన్నతాధికారికి హైదరాబాద్, శివార్లలో ఉన్న భూ దందాలను పర్యవేక్షించే, సెటిల్‌మెంట్లు చేసే బాధ్యత నిర్వర్తించడానికి నయీమ్ అంగీకరించాడని తెలిసింది. అయితే తనకో శాటిలైట్ ఫోన్ గిఫ్ట్‌గా కావాలని నయీమ్ కోరాడని, అమెరికా నుంచి ఓ ఫోన్‌ను ఖరీదు చేసిన సదరు అధికారి నయీమ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారని సమాచారం.

దీంతో అప్పటి నుంచి నయీమ్‌ను తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్న ఆ ఇద్దరు అధికారులూ భారీ మొత్తంలో డబ్బుతో పాటు హైదరాబాద్, శివారులో భూములు కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయీమ్ కేసులపై దృష్టిపెట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ దిశలోనూ ఆరా తీయడంతో పాటు శాటిలైట్ ఫోన్ ఏమైందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నయీమ్ ఎన్‌కౌంటర్ నుంచి ఆ ఇద్దరు అధికారులూ తెలంగాణలో ఉన్న కొందరు పరిచయస్తులైన అధికారుల్ని సంప్రదిస్తూ... కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారని సమాచారం.
 
ఎన్‌కౌంటర్ల తర్వాత ‘పెద్దాయన’తో..
ఏపీలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు అంగీకరించిన నయీమ్ ప్రతిఫలంగా తనకు ఏం కావాలో తర్వాత చెప్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. 2014, 2015ల్లో కోస్తా జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోనూ రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇవి నయీమ్ అందించిన సమాచారంతోనే జరిగినట్లు తెలిసింది. దీంతో నయీమ్‌పై నమ్మకం పెరిగిన సదరు అధికారి ఇతడిని మరో ఉన్నతాధికారికి పరిచయం చేశాడు. అప్పట్లో ఈ ఉన్నతాధికారి సీఆర్‌డీఏ పరిధిలో కీలక బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇద్దరు అధికారులూ నయీమ్‌ను మావోయిస్టు కోణంలోనే వినియోగించుకోవాలని తొలుత భావించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement