తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు
► ఉత్తర్వులు జారీచేసిన వైద్య ఆరోగ్యశాఖ
► రాష్ట్రంలో వైద్యం చేయాలంటే కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
► ఆస్పత్రుల పర్యవేక్షణ, నకిలీ డాక్టర్ల గుర్తింపు బాధ్యతా కౌన్సిల్‌దే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పా టైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోప్రపంచంలో ఎక్కడ వైద్య విద్య పూర్తిచేసినా తెలంగాణలో వైద్యం చేయాలంటే ఈ కౌన్సిల్ లో తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రాష్ట్రం విడిపోయినా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లోనే వైద్యులు తమ రిజిస్ట్రేషన్లు నమోదు చేసుకున్నారు. తాజాగా రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ ఏర్పాటు కావడంతో తెలంగాణ వైద్యులకు వెసులుబాటు కలిగింది. ఇప్పటికే తెలంగాణలో ఏళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నవారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? వద్దా? అనే విషయంపై ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టత ఇవ్వలేదు.
మెడికల్ కౌన్సిల్‌కే ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యత
కొత్తగా ఏర్పాటైన మెడికల్ కౌన్సిల్ రాష్ట్రంలో ఆస్పత్రులపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రమాణాలకు విరుద్ధంగా ఆస్పత్రులను నడిపే వారిపై చర్యలు తీసుకునే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది. నకిలీ డాక్టర్లను గుర్తించడం కూడా కౌన్సిల్ బాధ్యతే. కౌన్సిల్‌లో సభ్యులుగా డాక్టర్ రాజ్ సిద్దార్థ్, డాక్టర్ వి.రాజలింగం, డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఇ.రవీంద్రరెడ్డి, డాక్టర్ జగన్మోహన్‌రావు, డాక్టర్ బి.రమేష్‌కుమార్‌లు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు వైద్య విద్య సంచాలకులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ డెరైక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, తెలంగాణ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌లు సభ్యులుగా ఉంటారు.