జర్నలిస్టులందరికీ మెరుగైన వైద్యం
► హెల్త్‌కార్డుల అమలుకు ప్రత్యేక సీఈవో
► కార్డుల జారీలో ఇబ్బందులు వాస్తవమే.. వాటిని తొలగిస్తాం
-- మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ వారు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులతో ఏర్పడే అవాంతరాలను తొలగిస్తామని, దాని కోసం ప్రత్యేకంగా ఒక సీఈవోను నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించిన హెల్త్‌కార్డుల్లో ఇబ్బందులున్న మాట వాస్తవమేనని, అయితే నాలుగైదు తప్ప, అన్ని ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులకు వైద్య పరీక్షలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.
మంత్రి అయిన తర్వాత బీపీ పెరిగింది..
సర్కారు దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. పేదలకు సేవ చేసే ఆస్పత్రులపై పోత్సాహకరంగా వార్తలు రాస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి కాకముందు తనకు బీపీ, మధుమేహం లేవని, ఇప్పుడు బీపీ వచ్చిందన్నారు. మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రుల్లో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్‌క్లబ్ జాయింట్ సెక్రటరీ రమేశ్ వైట్ల, ఈసీ మెంబర్స్ వి.యశోద, ఎ.రాజేశ్, జి.వసంత కుమార్, నరేందర్ జీ పద్మశాలీ, సి.హరి ప్రసాద్, వైద్యులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ పంకజ్, డాక్టర్ సునీల్, డాక్టర్ వకిల్, డాక్టర్ హిమకాంత్ తదితరులు పాల్గొన్నారు.