journalists health cards
-
జర్నలిస్టుల హెల్త్‌కార్డులు చెల్లుబాటయ్యేలా చూడండి
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రా వును మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ కోరారు. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావును కలిసి జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. హెల్త్ కార్డుల అమలులో ఎదురౌతు న్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, మీడియా అకాడమీ చైర్మన్‌తో పాటు, జర్నలిస్టు ప్రతినిధులను కూడా పిలిచి త్వరలో చర్చిస్తామన్నారు. జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు కూడా ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుకు అల్లం నారాయణ, చంటి క్రాంతి కిరణ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే నాయకులు సూరజ్ భరద్వాజ్, సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
జర్నలిస్టులందరికీ మెరుగైన వైద్యం
► హెల్త్‌కార్డుల అమలుకు ప్రత్యేక సీఈవో ► కార్డుల జారీలో ఇబ్బందులు వాస్తవమే.. వాటిని తొలగిస్తాం -- మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ వారు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. హెల్త్‌కార్డులతో ఏర్పడే అవాంతరాలను తొలగిస్తామని, దాని కోసం ప్రత్యేకంగా ఒక సీఈవోను నియమిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించిన హెల్త్‌కార్డుల్లో ఇబ్బందులున్న మాట వాస్తవమేనని, అయితే నాలుగైదు తప్ప, అన్ని ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులకు వైద్య పరీక్షలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. మంత్రి అయిన తర్వాత బీపీ పెరిగింది.. సర్కారు దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. పేదలకు సేవ చేసే ఆస్పత్రులపై పోత్సాహకరంగా వార్తలు రాస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి కాకముందు తనకు బీపీ, మధుమేహం లేవని, ఇప్పుడు బీపీ వచ్చిందన్నారు. మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రుల్లో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్‌క్లబ్ జాయింట్ సెక్రటరీ రమేశ్ వైట్ల, ఈసీ మెంబర్స్ వి.యశోద, ఎ.రాజేశ్, జి.వసంత కుమార్, నరేందర్ జీ పద్మశాలీ, సి.హరి ప్రసాద్, వైద్యులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ పంకజ్, డాక్టర్ సునీల్, డాక్టర్ వకిల్, డాక్టర్ హిమకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పాత్రికేయులకు హెల్త్‌కార్డులపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమ నిధికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని సోమవారం ప్రెస్ అకాడమీకి బదిలీ చేసి జర్నలిస్టుల సంక్షేమ నిధి పేరిట ఖాతా ప్రారంభించి బ్యాంకులో డిపాజిట్ చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ ఈ నిధి కింద కొంత మొత్తాన్ని కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రెస్ అకాడమీలో సీనియర్ జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు రమణాచారి, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం అక్కడికక్కడే తొమ్మిది మంది సీనియర్ జర్నలిస్టులతో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ హెల్త్‌కార్డులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టర్లకు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల జారీకి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తుంది. దీనిపై వారం రోజుల్లోగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ మేరకు సమావేశ వివరాలను అల్లం నారాయణ మీడియాకు వెల్లడించారు. కాగా, సచివాలయంలో మీడియాకు సంబంధించిన ఆంక్షల ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చ జరగలేదు. కమిటీ సభ్యులు వీరే... కె. రామచంద్రమూర్తి (సాక్షి, ఎడిటోరియల్ డెరైక్టర్), జహీరుద్దీన్ (సియాసత్ ఎడిటర్), కె.శ్రీనివాస్‌రెడ్డి (మన తెలంగాణ ఎడిటర్), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ ఎడిటర్), శైలేష్‌రెడ్డి (6 టీవీ సీఈవో), వెంకటకృష్ణ (హెచ్ఎం టీవీ సీఈవో), గౌరీశంకర్ (దక్కన్ క్రానికల్, పొలిటికల్ ఎడిటర్), క్రాంతి (టీయూడబ్ల్యూజే నేత) సి.వనజ ఈ కమిటీలో ఉన్నారు. కేసీఆర్‌కు ప్రెస్ అకాడమీ చైర్మన్ కృతజ్ఞతలు రాష్ట్ర ప్రెస్ అకాడమీని తొలిసారి సందర్శించడంతోపాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సీఎం కే సీఆర్‌కు తెలంగాణ జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ. 10 కోట్లను సోమవారం విడుదల చేస్తామని పేర్కొనడం, ‘కార్పస్ ఫండ్’ను రూ.100 కోట్లకు పెంచుతామని హామీ ఇవ్వడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియూడబ్ల్యూజే) సంఘం నేతలు పల్లె రవికుమార్, సిహెచ్ కాంత్రి కిరణ్, ఎం.వి.రమణ మరో ప్రకటనలో పేర్కొన్నారు.