శనివారం హైదరాబాద్ లోని ప్రెస్ అకాడమీలో సీనియర్ పాత్రికేయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమ నిధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని సోమవారం ప్రెస్ అకాడమీకి బదిలీ చేసి జర్నలిస్టుల సంక్షేమ నిధి పేరిట ఖాతా ప్రారంభించి బ్యాంకులో డిపాజిట్ చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనూ ఈ నిధి కింద కొంత మొత్తాన్ని కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రెస్ అకాడమీలో సీనియర్ జర్నలిస్టులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు రమణాచారి, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ పాల్గొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు సీఎం అక్కడికక్కడే తొమ్మిది మంది సీనియర్ జర్నలిస్టులతో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీ హెల్త్‌కార్డులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టర్లకు ఇచ్చే అక్రెడిటేషన్ కార్డుల జారీకి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తుంది. దీనిపై వారం రోజుల్లోగా ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ మేరకు సమావేశ వివరాలను అల్లం నారాయణ మీడియాకు వెల్లడించారు. కాగా, సచివాలయంలో మీడియాకు సంబంధించిన ఆంక్షల ప్రతిపాదనలపై ఈ భేటీలో ప్రత్యేకంగా చర్చ జరగలేదు.
కమిటీ సభ్యులు వీరే...
కె. రామచంద్రమూర్తి (సాక్షి, ఎడిటోరియల్ డెరైక్టర్), జహీరుద్దీన్ (సియాసత్ ఎడిటర్), కె.శ్రీనివాస్‌రెడ్డి (మన తెలంగాణ ఎడిటర్), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ ఎడిటర్), శైలేష్‌రెడ్డి (6 టీవీ సీఈవో), వెంకటకృష్ణ (హెచ్‌ఎం టీవీ సీఈవో), గౌరీశంకర్ (దక్కన్ క్రానికల్, పొలిటికల్ ఎడిటర్), క్రాంతి (టీయూడబ్ల్యూజే నేత) సి.వనజ ఈ కమిటీలో ఉన్నారు.
కేసీఆర్‌కు ప్రెస్ అకాడమీ చైర్మన్ కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రెస్ అకాడమీని తొలిసారి సందర్శించడంతోపాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సీఎం కే సీఆర్‌కు తెలంగాణ జర్నలిస్టుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టు సంక్షేమ నిధికి రూ. 10 కోట్లను సోమవారం విడుదల చేస్తామని పేర్కొనడం, ‘కార్పస్ ఫండ్’ను రూ.100 కోట్లకు పెంచుతామని హామీ ఇవ్వడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియూడబ్ల్యూజే) సంఘం నేతలు పల్లె రవికుమార్, సిహెచ్ కాంత్రి కిరణ్, ఎం.వి.రమణ మరో ప్రకటనలో పేర్కొన్నారు.