
తెలంగాణకు డల్లాస్‌లో విరాళాల గలగల
⇒ 2 లక్షల డాలర్ల విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్నారైలు
⇒ 150 ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ అమెరికాలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు రెండు లక్షల అమెరికన్ డాలర్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం డల్లాస్‌లో ఎన్నారైలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన మంత్రి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు ‘వైబ్రంట్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఐటీతో పాటు ఏరోస్పేస్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లో పేరుగాంచిన సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు.
టీ-హబ్‌తో యువత ఆశలకు రెక్కలు
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ-హబ్ ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి, వారి ఆశలు నెరవేర్చనున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. డల్లాస్‌లో 150 ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఐటీసర్వ్ అలయన్స్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సదుపాయాల గురించి ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అనంతరం డల్లాస్‌లోని సిమా క్లబ్‌లో ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక పెట్టుబడుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సహకార ధోరణితో ముందుకు సాగుతుందన్నారు. కేటీఆర్ వెంట టిటా, టాటా, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.