make in telangana
-
ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్
ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారానే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాధ్యమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు వర్క్‌షాప్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫైబర్ ప్రాజెక్టులో ప్రతి పౌరుడికి అవకాశం ఇవ్వాలనేది వర్క్‌షాప్ లక్ష్యమన్నారు. విద్య, వైద్య, ప్రభుత్వం సేవల వంటి రంగాల్లో ఈ ప్రాజక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈప్రాజెక్టు ద్వారానే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాధ్యమన్నారు. ఈ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోందని, అందుకు అందరూ సహకరించాలన్నారు. -
సిలికాన్‌వ్యాలీ ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తి
టీఐఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగం సాక్షి,హైదరాబాద్: సిలికాన్ వ్యాలీ వంటి టెక్ ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు యువతకు స్ఫూర్తినిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. సిలికాన్ వ్యాలీ విజయానికి ఇక్కడి అనుకూల వాతావరణమే ప్రధాన కారణమని, అదే తరహాలో హైదరాబాద్‌లోనూ నూతన ఆలోచనలను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ అయిన టీ-హబ్ అవుట్ పోస్ట్‌ను సిలికాన్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బుధవారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సిలికాన్ వ్యాలీలో ప్రసంగించారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్(టీఐఈ)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు, తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు, విధానాలపై మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే తమ ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వాలు తాత్కాలికం, విధానాలు శాశ్వతమన్నదే తమ నమ్మకమన్న కేటీఆర్, పారిశ్రామిక, వ్యవసాయ, సంక్షేమ రంగాల సమగ్రాభివృధ్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని ప్రధానాంశాలైన సెల్ఫ్ సర్టిఫికేషన్, 15 రోజుల్లో అనుమతులు, సింగిల్ విండో విధానాలను మంత్రి వివరించారు. పెట్టుబడులు పెట్టండి.. టీ-హబ్‌లోని స్టార్టప్‌లను స్కేల్ అప్స్‌గా మార్చేందుకు అంతా సహకరించాలని మంత్రి కోరారు. టీఐఈతో పాటు సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ప్రభుత్వ ఖర్చుతో శిక్షణ ఇచ్చి కంపెనీలకు ఉద్యోగులను అందించే టాస్క్ వంటి వినూత్నమైన పథకం కేవలం తెలంగాణలోనే ఉందన్నారు. డిజిటల్ తెలంగాణలో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సాఫ్ట్‌వేర్‌తో పాటు మ్యాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మేకిన్ తెలంగాణలో భాగంగా అద్భుత పారిశ్రామిక, ఎలక్ట్రానిక్ విధానాలను తీసుకొచ్చామని, తమ ప్రభుత్వ రూరల్ టెక్ విధానంతో కామారెడ్డి వంటి చిన్న పట్టణాల్లోనూ బీపీఓ సెంటర్లు ప్రారంభమవుతున్నాయని గుర్తు చేశారు. ఓ వైపు బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తూనే మరోవైపు ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ చెప్పారు. -
‘బోయింగ్ జేవీ’ తో.. మేక్ ఇన్ తెలంగాణకు ఊతం
ఏరోక్యాంపస్ అక్విటైన్తో కలిసి ఏవియేషన్ అకాడమీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ దిగ్గజం బోయింగ్ రాక తెలంగాణకు మరింత విలువ చేకూరుస్తుందని ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్) అన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ విడిభాగాల తయారీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ యత్నాలకు ఊతమిస్తుందని తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన బోయింగ్ సప్లయర్స్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ‘తెలంగాణకు మరిన్ని కంపెనీలు వచ్చేందుకు బోయింగ్-టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌ల జాయింట్ వెంచర్ దోహదం చేస్తుంది. బోయింగ్‌కు విడిభాగాలు సరఫరా చేసే కంపెనీలు హైదరాబాద్‌కు వస్తాయి. ఇప్పటికే ఇక్కడ కార ్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఇది చక్కని అవకాశం. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో పెట్టుబడి పెట్టే కంపెనీలకు పూర్తి సహకారం ఉంటుంది’ అని తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఏరోక్యాంపస్ అక్విటైన్తో కలిసి ఏవియేషన్ అకాడమీ ఏర్పా టు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రాట్ అండ్ విట్నీ తన హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించే అవకాశం ఉందన్నారు. అపాచీ హెలికాప్టర్ల విడిభాగాల తయారీ... హైదరాబాద్ కేంద్రంలో తొలుత అపాచీ హెలికాప్టర్ల ప్రధాన విడిభాగాలను తయారు చేయనున్నట్టు బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్ తెలిపారు.భవిష్యత్తులో అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి జేవీ ఊతమిస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈవో సుకరన్ సింగ్ చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అవకాశాలను అందుకోవడానికై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), బోయింగ్‌లు జూలైలో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ ఆదిభట్ల వద్ద ఫెసిలిటీని నెలకొల్పనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 8.5 ఎకరాలను కేటాయించింది. ఈ ఫెసిలిటీకై జేవీ సుమారు రూ.400 కోట్లు వెచ్చించనుంది. -
తెలంగాణకు డల్లాస్‌లో విరాళాల గలగల
⇒ 2 లక్షల డాలర్ల విరాళం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఎన్నారైలు ⇒ 150 ఐటీ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ అమెరికాలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలకు రెండు లక్షల అమెరికన్ డాలర్లను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం డల్లాస్‌లో ఎన్నారైలు నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన మంత్రి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్నారైలు భాగస్వాములు కావాలని కోరారు. అంతకుముందు ‘వైబ్రంట్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఐటీతో పాటు ఏరోస్పేస్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లో పేరుగాంచిన సంస్థలతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. టీ-హబ్‌తో యువత ఆశలకు రెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ-హబ్ ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి, వారి ఆశలు నెరవేర్చనున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. డల్లాస్‌లో 150 ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఐటీసర్వ్ అలయన్స్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సదుపాయాల గురించి ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం డల్లాస్‌లోని సిమా క్లబ్లో ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పారిశ్రామిక పెట్టుబడుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సహకార ధోరణితో ముందుకు సాగుతుందన్నారు. కేటీఆర్ వెంట టిటా, టాటా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. -
'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి'
హైదరాబాద్: మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. యూఎస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆదివారం డల్లాస్‌లో నిర్వహించిన ఐటీ సర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ కంపెనీ ప్రతినిధులు, ఎన్నారైలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై కేటీఆర్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణలో కంపెనీలు పెడితే ప్రభుత్వపరంగా అన్నివిధాల సహకారం అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా ఎన్నారైలకు హామీ ఇచ్చారు. కేటీఆర్ రెండు వారాల అమెరికా పర్యటనలో మే 5వ తేదీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన మే 16వ తేదీన భారత్ తిరిగి ప్రయాణం అవుతారు.