కొత్త జిల్లాలపై అధ్యయన కమిటీలు
ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు నేతలకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
* మూడు నమూనాలు సిద్ధం చేసిన సీసీఎల్‌ఏ
* ‘ట్రాక్’ సహాయంతో కొత్త హద్దులతో మ్యాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరుసగా సమీక్షలు నిర్వహించడంతో... రెవెన్యూ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు శాటిలైట్ మ్యాపులు, గూగుల్ మ్యాపులను ఆధారంగా చేసుకుని కొత్త జిల్లాల హద్దులను గుర్తించే ప్రక్రియ మొదలైంది.
జిల్లాల ఏర్పాటుపై ముందు నుంచి కసరత్తు చేస్తున్న భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) 3 నమూనాల్ని సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిలో ప్రభుత్వం ఎంపిక చేసిన నమూనా ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అనంతరం అభ్యంతరాలను స్వీకరించి.. కొత్త జిల్లాల తుది స్వరూపాన్ని ఖరారు చేస్తారు. ప్రస్తుతం ఇచ్చిన మూడు నమూనాలకు సీసీఎల్‌ఏ వేర్వేరు ప్రాతిపదికలను అనుసరించింది. పార్లమెంట్ నియోజకవర్గానికో జిల్లా ఉండేలా ఒక నమూనా, జనాభా ప్రాతిపదికన మరో నమూనా, అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాతిపదికగా మరో నమూనాను రూపొందించినట్లు సమాచారం.
అదనంగా 14 జిల్లాల వరకు పెంచేందుకు వీలుగా ఈ నమూనాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (ట్రాక్) సహాయంతో సీసీఎల్‌ఏ ఈ మ్యాప్‌లను తయారు చేయించారు. ఇదే తీరుగా సరిహద్దు నమూనాలతో మరిన్ని మ్యాప్‌లు తయారు చేయాలని సంబంధిత నిపుణులకు ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పరిధిలో జిల్లా కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకు దూరం 60 కిలోమీటర్లకు మించకుండా ఉండేలా చూడాలన్న సీఎం సూచనకు అనుగుణంగా శాస్త్రీయంగా కసరత్తు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అభిప్రాయ సేకరణకు కమిటీలు
క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేయడానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ తాజాగా బాధ్యతలు అప్ప గించారు. ఒక్కో జిల్లాకు ఇద్దరు నేతలతో కూడిన 9 కమిటీలను నియమించారు. గ్రామ, మండల, జిల్లాల స్థాయిలో పునర్విభజన స్వరూపం ఎలా ఉండా లి, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్ని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలి, అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ 9 కమిటీల సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో పరిస్థితులను అధ్యయనం చేసే బాధ్యతా ఆయనకే అప్పగించారు. మెదక్ జిల్లాలో హరీశ్ సూచనల మేరకు కమిటీ పని చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం.
పునర్విభజన కమిటీల సభ్యులు
ఖమ్మం: తుమ్మల నాగేశ్వరరావు, పాయం వెంకటేశ్వర్లు
రంగారెడ్డి: మహేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి
నల్లగొండ: జగదీశ్‌రెడ్డి, గ్యాదరి కిషోర్
మహబూబ్‌నగర్: నిరంజన్‌రెడ్డి, గువ్వల బాలరాజు
నిజామాబాద్: ప్రశాంత్‌రెడ్డి, గంప గోవర్ధన్
కరీంనగర్: వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్
ఆదిలాబాద్: లోకా భూమారెడ్డి, వేణుగోపాలాచారి
మెదక్: శేరి సుభాష్‌రెడ్డి, మానిక్‌రెడ్డి
వరంగల్: పెద్ది సుదర్శన్‌రెడ్డి, మధుసూదనాచారి