అద్దెకు తెలంగాణ జైళ్లు | Telangana prisons for rent | Sakshi
Sakshi News home page

అద్దెకు తెలంగాణ జైళ్లు

Published Thu, Jul 27 2017 1:16 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

అద్దెకు తెలంగాణ జైళ్లు

అద్దెకు తెలంగాణ జైళ్లు

- ఏడాది తర్వాత అమలుకు యోచన
ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు
జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్‌ వెల్లడి  
 
హైదరాబాద్‌: తెలంగాణ జైళ్లలో ఖైదీల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడి బ్యారక్‌లను ఖైదీలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాలకు అద్దెకు ఇవ్వాలని జైళ్ల శాఖ యోచిస్తోంది. ఏడాది తర్వాత దీన్ని అమల్లోకి తీసుకురావడానికి వీలుగా రూపొందిం చిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు ఆ శాఖ డీజీ వీకే సింగ్‌ బుధవారం తెలిపారు. నార్వే తరహాలో రాష్ట్రంలోని జైళ్లను ఇతర రాష్ట్రాల ఖైదీలకు అద్దెకు ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. రాష్ట్ర జైళ్ల సామర్థ్యం 6,848 మంది ఖైదీలు కాగా.. ఈ నెల 15 నాటికి ఆ సంఖ్య 6,083గా ఉందని తెలిపారు.

మరో ఏడాది పాటు ఈ ఖైదీల సంఖ్య పరిగణనలోకి తీసుకుని ‘అద్దెకు జైళ్లు’ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. బిహార్, ఉత్తరప్రదేశ్‌ జైళ్లలో ఖైదీల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోయిందని, అలాంటి వారిలో గరిష్టంగా 800 మందికి రాష్ట్ర జైళ్లలో ఖైదు చేసే ఆస్కారం ఉందన్నారు. తద్వారా ఏటా రూ.25 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చని స్పష్టం చేశారు. మహాపరివర్తన్, విద్యాదాన్, ఉన్నతి వంటి కార్యక్రమాల వల్ల కరడుగట్టిన నేరస్తులు సైతం జీవనోపాధి పొంది కొత్త జీవితాలు ప్రారంభించారని వివరించారు. ఇటీవల చర్లపల్లి కారాగారాన్ని సందర్శించిన బిహార్‌ రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అమీర్‌ సుభాని రాష్ట్రంలోని జైళ్లలో జరుగుతున్న మార్పులు, కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రశంసలు కురిపించారని చెప్పారు. 
 
త్వరలో మరో 29 ఖైదీల పెట్రోల్‌ బంకులు..
జైళ్ల శాఖను ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లేందుకు ఖైదీలు నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌లు కీలకంగా మారాయని వీకే సింగ్‌ చెప్పారు. ఈ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా మరో 29 పెట్రోల్‌ బంక్‌లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. చర్లపల్లి జైల్‌లో 3, వరంగల్‌ జైల్‌లో 2, నల్లగొండ జిల్లాలో 5, నిజామాబాద్‌ జిల్లాలో 1, కరీంనగర్‌ జిల్లాలో 6, ఖమ్మం జిల్లాలో 1, ఆదిలాబాద్‌లో 2, వరంగల్‌ సబ్‌ జైల్‌ పరిధిలో 1, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 3, మహబూబ్‌నగర్‌ సబ్‌ జైల్‌ పరిదిలో 2 బంక్‌లు, వీటితో పాటు మరో వారం రోజుల్లో సరూర్‌ నగర్, లింగోజీగూడ, ఆసిఫాబాద్‌ల్లో ప్రారంభిస్తామన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement