సచివాలయంలో వైభవంగా బోనాలు | Telangana Secretariat in Two states Employees Bonalu festivals | Sakshi
Sakshi News home page

సచివాలయంలో వైభవంగా బోనాలు

Published Sat, Aug 6 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

సచివాలయంలో వైభవంగా బోనాలు

సచివాలయంలో వైభవంగా బోనాలు

రెండు రాష్ట్రాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  సచివాలయం రెండు రాష్ట్రాల ఉద్యోగుల కోలాహలంతో కళకళలాడింది. ప్రాంగణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో ఉద్యోగులు బోనాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఉద్యోగులు పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు.

ఏపీ ఉద్యోగులు అమరావతికి వెళ్లిపోతున్న నేపథ్యంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి.. ఏపీ ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు పలికింది.   ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులను,  ఉద్యోగులను ఇదే వేదికపై సన్మానించారు.  ఉద్యోగరీత్యా ఇన్నేళ్లు ఒకేచోట పని చేసి ఇప్పుడు విడిపోవడం బాధగా ఉందన్నారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరిగింది. జీఏడీ కార్యదర్శులు అదర్ సిన్హా, వెంకటేశ్వరరావు, ఏపీ నుంచి పాణిగ్రాహి, ప్రేమ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు.
 
రిటైరయ్యాక ఇక్కడే ఉంటాం
హైదరాబాద్‌లోనే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఉద్యోగ విరమణ తర్వాత ఇక్కడే సెటిలవుతామని కొందరు ఏపీ ఉద్యోగులు చెప్పారు. ప్రాంతాలు విడిపోయినా అన్నాదమ్ముళ్లుగా కలసి ఉందామన్నారు. 2 రాష్ట్రాలు అభివృద్ధిలో మొదటి స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉంటుందని, ఎక్కడి నుంచి వచ్చినవారైనా ఈ ప్రాంతాన్ని తమ సొంత ప్రాంతంగా భావిస్తారని లింగరాజు పాణిగ్రహి అభిప్రాయపడ్డారు. అనంతరం ఇరు రాష్ట్రాల ఉద్యోగులు కలసి సామూహిక భోజనాలు చేశారు.
 
ఏటా బోనాలకు ఆహ్వానిస్తాం
ప్రతి ఏటా ప్రాంతాలకతీతంగా బోనాల పండగను నిర్వహించుకునే వారమని, రెండు రాష్ట్రాల ఉద్యోగులు విడిపోయినందున వచ్చే ఏడాది ఏపీకి వెళ్లి ఉద్యోగులను ఆహ్వానిస్తామని, బోనాల పండగను నిర్వహించుకుంటామని నరేందర్‌రావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement