‘గ్రేటర్’ ఎన్నికలకు వేళాయె..
► నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వెల్లడి
► ఎన్నికల సంఘం వెబ్‌పోర్టల్ నుంచి ఓటరు స్లిప్‌లు
► రాజకీయ పార్టీలు ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించుకోవాలి
► ఎన్నికల నిర్వహణకు లక్ష మంది సిబ్బంది
► నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించడమే తరువాయి అని, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ చకచకా సాగిపోతుందని చెప్పారు. సోమవారం ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు ఆదేశాల మేరకు జనవరి నెలాఖరులోగా ఎన్నికలు జరగాల్సి ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని నాగిరెడ్డి చెప్పారు. మూడు నెలలుగా ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉన్నామని, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పారు. నోటిఫికేషన్ నుంచి పోలింగ్‌కు దాదాపు నెల రోజులు సమయం ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జనవరిలోగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి వస్తే హైకోర్టుకు విషయాన్ని నివేదించాల్సి ఉంటుందన్నారు.
పోలింగ్ శాతం పెంపునకు కృషి..
సాధారణ ఎన్నికలు, జిల్లాల్లోని స్థానిక సంస్థల పోలింగ్‌తో పోలిస్తే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువని, ఈసారి దానిని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందుకుగానూ విస్తృత ప్రచార కార్యక్రమాలతోపాటు ఇతరత్రా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం వెబ్‌పోర్టల్ నుంచే ఓటరుస్లిప్‌లు పొందే వెసులు బాటు అందుబాటులోకి తెచ్చామన్నారు. (ఠీఠీఠీ.్టట్ఛఛి.జౌఠి.జీ) వెబ్‌సైట్ నుంచి వాటిని పొందవచ్చన్నారు. వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాను పోర్టల్‌లో ఉంచామని, జాబితాలో పేరు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కష్టమనుకోకుండా నగర పౌరులు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక మేనిఫెస్టో ఉండాలి..
జీహెచ్‌ఎంసీలో చేపట్టబోయే పనులకు సంబంధించి రాజకీయ పార్టీలు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించుకుంటే మంచిదని నాగిరెడ్డి సూచించారు. తద్వారా ఏం చేయవచ్చో స్పష్టత ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు లక్ష మంది సిబ్బందిని నియమించనున్నట్టు చెప్పారు. ఎన్నికల విధులకు గైర్హాజర య్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్ల జాబితాపై 3,91,369 క్లెయిమ్స్ రాగా, వాటిలో 2,90,942 దరఖాస్తులు ఆమోదించామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 46,612 దర ఖాస్తులు తిరస్కరించామని, మరో 54,365 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు.
మరోవైపు మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్‌ఎంసీకి జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. విలేకరుల సమావేశంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) సురేంద్రమోహన్, జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.