- 12వ తేదీకి బదులు 11నే విడుదల
- ప్రకటించనున్న డిప్యూటీ సీఎం కడియం
- 15 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేయనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ముందుగా 12వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి ఆ రోజున అందుబాటులో ఉండని కారణంగా 11నే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.64 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాశారు. మరోవైపు వివిధ పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 15 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణామండలి సన్నాహాలు చేస్తోంది. గత నెల 21న నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. టెన్త్ ఫలితాల విడుదల మేరకు పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రూపొందించాలని అధికారులు భావించారు.
బుధవారం టెన్త్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో 15 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక విద్యా యంత్రాంగం సమాయత్తమవుతోంది. సాంకేతిక విద్య కమిషనర్ ఆధ్వర్యంలో మంగళవారం జరగనున్న పాలిసెట్ కమిటీ సమావేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.